మొక్కుబ‌డిగా మొక్క‌లు నాటి చేతులు దులుపుకోం

కరీంనగర్: రాష్ట్ర‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్ర‌జలు పెద్దఎత్తున భాగస్వాములు కావాలని, ఈ కార్య‌క్రమాన్ని ఓ ఉద్యమంలా, యజ్ఞంలా చేపట్టాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమ‌వారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 11, 12 డివిజన్లలో మంత్రి మొక్కలు నాటారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కాంక్రీట్ జంగిల్ గా మారిన కరీంనగరాన్ని హరితవనంగా తీర్చిదిద్దుతామ‌ని అన్నారు. భావిత‌రానికి ఆస్తి చెట్లు, నీరేన‌ని.. నగరంలో 12 లక్షల మొక్కలు నాటడమే త‌మ‌ లక్ష్యమ‌ని అన్నారు. మొక్కుబడిగా మొక్కలను నాటి… చేతులు దులుపుకోకుండా… వాటిని చిత్తశుద్ధితో సంరక్షిస్తామ‌ని చెప్పారు. మొక్కలను నాటడం తోపాటు వాటిని సంరక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామ‌ని అన్నారు

వాతావరణంలో సమతుల్యత లోపించి వర్షాలు రాకపోవడానికి అడవులు అంతరించి పోవడమే కారణమ‌న్న గంగుల.. అడవుల పెంపకంలో కరీంనగర్ జిల్లాకు పూర్వ వైభవం తీసుకు వస్తామ‌ని చెప్పారు. జిల్లాలో 50 లక్షల మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామ‌న్నారు. మొక్కల సంరక్షణ కోసం ఒక్కో డివిజన్ కు ఒక స్పెషల్ ఆఫీసర్ ను కేటాయించామ‌ని చెప్పారు. హరితహారం లో నాటిన మొక్కల్లో 80 శాతం మొక్కలు బ్రతికే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలన్నారు.

భావితరాలకు బంగారు బాటలు వేసేందుకే ఈ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టామ‌ని.. మొక్కలను సంరక్షించు కోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని‌ చెప్పారు. మొక్కలను సంరక్షించని వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడ‌మ‌ని, ఇప్పటికే ఈ విషయాన్ని చట్టంలో చేర్చామ‌ని మంత్రి అన్నారు.

Latest Updates