రేప‌టి నుండి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ

కరీంనగర్: ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జులై నెలకు సంబంధించి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తామ‌ని మంత్రి గంగుల క‌మలాక‌ర్ తెలిపారు. శ‌నివారం కరీంనగర్ లోని క్యాంపు ఆఫీసులో నిర్వ‌హించిన‌ ప్రెస్ మీట్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం ఒక్కొక్కరికి నవంబర్ వరకు 5 కిలోలు ఉచిత బియ్యం ఇస్తామని ప్రకటించిందని, కేంద్రం వాటాకు మరో 5 కిలోలు కలిపి ఈనెల నుంచి నవంబరు వరకు మనిషికి 10 కిలోల బియ్యం పంపిణీ చేస్తామ‌ని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 87 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయని.. ఉచిత బియ్యం పంపిణీతో రాష్ట్రంలో రెండు కోట్ల 79 లక్షల మంది పేదలకు లబ్ది కలగనుందని మంత్రి చెప్పారు.

కరీంనగర్ లో రేపు బియ్యం పంపిణీ ప్రారంభిస్తానని మంత్రి గంగుల ప్ర‌క‌టించారు. లాక్‌డౌన్ సమయంలో నెలకు 216 కోట్ల రూపాయలను రేషన్ బియ్యానికి కేటాయించామ‌ని చెప్పారు. సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రంలో నెలకు ఒక కోటి 79 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమ‌ని, కానీ ఇప్పుడు అదనంగా ఇవ్వడం వల్ల 2 కోట్ల 89 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు.

ఆరో విడత హరితహారంలో భాగంగా కరీంనగర్ నగరంలో పది లక్షల మొక్కలు నాటుతామ‌ని మంత్రి చెప్పారు. అవకాశం ఉన్న చోట లంగ్ స్పేస్ అడవులు పెంచుతామ‌ని తెలిపారు.

Latest Updates