గ్రామాల్లోకి కొత్తవాళ్లు వస్తే సమాచారం ఇవ్వాలి

సంగారెడ్డి : గ్రామాల్లోకి కొత్తవాళ్లు వస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు మంత్రి హ‌రీష్ రావు. ఆందోల్‌ మండలం జోగిపేటలో 300 మంది పేదలు, జర్నలిస్టులకు హ‌రీష్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మ‌ట్లాడిన మంత్రి.. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రభుత్వం 12 కిలోల బియ్యంతో పాటు రూ.1500 నగదు ఇస్తున్నదని.. ప్రజలు లాక్ డౌన్ కు పూర్తిగా సహకరించాలన్నారు. మే నెలలో కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని డబ్లూహెచ్‌వో హెచ్చరించిందని తెలిపిన హ‌రీష్… ఇదో వింతరోగం చరిత్రలో ఎప్పుడూ వినలేదు..చూడలేదన్నారు.

సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు జలుబు, దగ్గు వచ్చిన వారు వెంటనే డాక్టర్ ను సంప్రదించాల‌ని.. ప్రతి నాయకుడు ప్రజలను ఆదుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కృషి చేస్తుందని.. డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు సమాజ బాగుకోసం నిత్యం కష్టపడుతున్నారని తెలిపారు. అమెరికాలో, ఇటలీలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అక్కడ చాలా మంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితి మన దగ్గర తెచ్చుకోవొద్దని సూచించారు మంత్రి హ‌రీష్.

 

Latest Updates