పని చేస్తే అభినందిస్తాం.. చేయ‌కుంటే చర్యలు తీసుకుంటాం

సంగారెడ్డి: బాగా పని చేస్తే అభినందిస్తాం , అన్ని విధాల సహకరిస్తాం, పని చేయని‌ వారిపై చర్యలు తీసుకుంటామ‌ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శ‌నివారం జిల్లాలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, సర్పంచులు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఏవో లు, ఏ ఈ ఓ లతో మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. స‌మీక్ష‌లో మంత్రి మాట్లాడుతూ .. డంపింగ్ యార్డ్ లు, వైకుంఠధామాల నిర్మాణాలు ఈ నెల 15లోగా, రైతు వేదికల నిర్మాణాలు ఈనెల 31లోగా పూర్తి చేయాలన్నది లక్ష్యమని పేర్కొన్నారు.

జిల్లా యంత్రాంగం నుంచి అన్ని విధాల సహకరిస్తున్నామని, అయినప్పటికీ నిర్మాణాలలో జాప్యం జరుగుతుందన్నారు. కొన్ని మండలాల్లో పనులు బాగా జరిగితే మరికొన్ని మండలాల్లో మరీ వెనుకబడి ఉన్నాయని, ఒకరిద్దరు సర్పంచులతో జిల్లా వెనకబడితే ఊరుకోమని, సర్పంచ్ ను తొలగించైనా పనులు పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ప్రభుత్వం నుంచి అన్ని‌ విధాల సహకారాన్ని అందిస్తామని పనులు మాత్రం ఆగకూడదని మంత్రి తెలిపారు. ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీఓ లు వీటి విషయంలో ప్రత్యేక చొరవతో, ఛాలెంజ్ గా తీసుకొని నిర్ణీత సమయంలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పని నెమ్మ‌దిగా జరుగుతున్న చోటికి వెళ్లి రాత్రింబవళ్ళు పనులు చేయించి పూర్తి చేయించాలని, లేనట్లయితే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పని జరిగేలా చూసే బాధ్యత ఎంపీడీవో, ఎంపీఓ లదని అన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతిరోజు సైట్ వద్దకు వెళ్లి పని పురోగతిని ఫోటోల రూపంలో నివేదికను ఎప్పటికప్పుడు సంబంధిత ఏవో కు పంపాలని తెలిపారు. ఏలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా యుద్ధ ప్రాతిపదికన ఆయా నిర్మాణాలు పూర్తి చేసి జిల్లాను ముందుంచాలని మంత్రి కోరారు.

Latest Updates