కేంద్ర విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం

నల్గొండ‌: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ బిల్లు 2020ని తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. శుక్రవారం న‌ల్గొండ‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రం రూపొందించిన విద్యుత్ బిల్లు 2020 మీద కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి.. రాష్ట్రం అభిప్రాయాన్ని అడిగారని తెలిపారు. అయితే, ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రికి చెప్పినట్లు తెలిపారు. బిల్లు వల్ల వినియోగదారులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. గృహ వినియోగదారులు సబ్సిడీ కోల్పోయే అవకాశం ఉందన్నారు. రైతులు కొత్త బిల్లుతో నష్టపోతారని.. సబ్సిడీ పొందుతున్న అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి.

విద్యుత్ బిల్లు 2020తో రాష్ట్రాల ప్రయోజనాలు హరించబడుతాయన్న ఆయ‌న‌.. ప్రైవేటు సంస్థలకు పూర్తిగా అప్పగించే ప్రయత్నం నడుస్తోందన్నారు. మూడు రకాల నష్టాలు ఈ బిల్లుతో ఉన్నాయని.. దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయన్నారు. రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా బిల్లులో ఒక్క లైన్ కూడా మార్చలేదన్నారు మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి.

Latest Updates