నాకు కరోనా రాదనే భ్రమలో ఉండొద్దు.. ఇందుకు ఉదాహరణే డిప్యూటీ స్పీకర్

కరీంనగర్: కరోనా అనేది ఏ ఒక్కరి వల్ల వచ్చింది కాదని, వైర‌స్ క‌ట్డ‌డికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. కోవిడ్-19 కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. బుధ‌వారం కరీంనగర్ లోని ప్రతిమ మెడికల్ కళాశాలలో మంత్రి మొబైల్ ఆసుపత్రి ప్రారంభించారు. అనంత‌రం మాట్లాడుతూ.. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు లాక్ డౌన్ పెడితే ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని.. ఫలితంగా కరోనా మరణాల కంటే లాక్ డౌన్ వల్ల సంభవించే మరణాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. అందుకే ప్రజలు ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకొని నియంత్రణ చేసుకోవాల‌ని చెప్పారు.

“ఎవరూ కూడా నాకు కరోనా రాదు… అనే అపోహతో ఉండొద్దు. ఇందుకు ఉదాహరణే డిప్యూటీ స్పీకర్ పద్మారావు. నేను ఓ కార్యక్రమానికి ఆయనతో కలిసి హాజరయినపుడు మాస్కు పెట్టుకోమంటే నాకు కరోనా రాదు అన్నారు. కానీ మరుసటి రోజే కరోనా వచ్చింది” అని కేటీఆర్ చెప్పారు. పెద్ద పెద్ద దేశాలే కరోనా కేసులు పెరగడం వల్ల కట్టడి చేయలేక చేతులు ఎత్తేశాయన్నారు. కరోనా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెయిల్ అయ్యార‌ని ప్ర‌తిప‌క్షాలు రాజకీయ విమర్శలు చేయడం దుర్మార్గపు చర్య అని కేటీఆర్ అన్నారు. ఆ విమర్శలు వారి పైశాచిక ఆనందం కోసం మాత్రమేన‌ని.. అలా విమర్శలు చేయడం వల్ల మన కరోనా వారియర్స్ ను నిరుత్సాహ పరిచినట్లేన‌ని చెప్పారు.

తాము కూడా కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయొచ్చని కానీ ఇది సరైన సందర్భం కాదని విమర్శలు చేయడం లేదన్నారు.
కరోనా నుండి కోలుకొని రికవరీ అయిన వారి గురించి ఎవ్వరు మాట్లాడరని…ఎక్కడో ఒక లోపం ఉంటే దాని పట్టుకొని గుంజడం సరికాదని చెప్పారు. ప్రభుత్వ తప్పులు కూడా ఎక్కడో ఒక చోట ఉంటాయి. అవి పట్టుకుని భూచీగా చూపడం తప్పని అన్నారు.

రాష్ట్రంలో కరోనా టెస్టులు సరిగా చేయడం లేదు…ఫలితాలు దాస్తున్నారని ప్రతిపక్షాలు అనడం దుర్మార్గపు చర్య అని, ఇలాంటి అర్ధరహిత విమర్శలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ అంటే ప్రభుత్వమే ఏదో అంటిస్తుంది అన్నట్లు కొందరు మాట్లాడటం చాలా బాధగా ఉందన్నారు. రాజకీయాలు చేయాలని అనుకుంటే ఇది అసలు సందర్భం కాదని , ఇలాంటి సమయంలో విమర్శలు చేయడం వల్ల ప్రజలు అయోమయంకు గురి అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి సలహాలు,సూచనలు ఇచ్చినా తాము పాటించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని, దయచేసి కరోనా పై పోరాటం చేస్తున్న వైద్యులు,పోలీసులను నిరుత్సాహపరిచే విధంగా విమర్శలు చేయడం మానుకోవాల‌న్నారు.

కరోనా వ్యాక్సిన్ తొందర్లోనే రావాలని కోరుకుంటున్నాన‌ని, అది కూడా మన తెలంగాణ రాష్ట్రం నుండే దేశానికి అందించాలని ప్రార్థిస్తున్నాన‌ని కేటీఆర్ చెప్పారు.

Latest Updates