కరోనాలోనూ సంక్షేమ పథకాలు ఆగకుండా అమలు చేస్తున్నాం

కరోనా వైర‌స్ వ‌ల్ల ఎదురైన క్లిష్ట ప‌రిస్థితుల్లోనూ.. సంక్షేమ పథకాలు ఆగకుండా అమలు చేస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమ‌వారం మహబూబ్ నగర్ జిల్లాలో వీరన్నపేట లో చేపట్టిన 660 డబుల్ బెడ్ రూం ఇళ్ల ను మంత్రి ప్రారంభోత్సవం చేసి,ఆ ఇళ్లకు కేటీఆర్ నగర్ గా నామకరణం చేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ…రాష్ట్రవ్యాప్తంగా 18 వేల కోట్ల రూపాయలతో 2 లక్షల 80 వేల గృహ నిర్మాణ కార్యక్రమం జరుగుతోంద‌ని, ఒక్క హైదరాబాద్ లో లక్ష ఇళ్లు కడుతున్నామ‌న్నారు.

దేశంలో మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న గృహ నిర్మాణం కంటే తెలంగాణలో ఎంతో ఘనంగా జరుగుతున్నదన్నారు కేటీఆర్. గత ప్రభుత్వాలు పిట్ట గూడు లాంటి ఇళ్లను నామమాత్రంగా కట్టార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. మధ్య దళారీలకు చోటు లేకుండా పేదలను వెతికి ఇళ్లు ఇచ్చామ‌న్నారు. పేద‌ల‌కు మెరుగైన సర్కారు వైద్యం, ఆసరా ఫించన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ సర్కారుదేన‌న్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామ‌ని, పేదవారిని మోసం చేసి డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం పైసల్ తింటే ఎవ్వరినీ వదిలిపెట్టమ‌ని ఆయ‌న అన్నారు.

“ఒకప్పుడు  కళ్ల ముందు నీళ్లున్నా వ్యవసాయం చేసుకోలేని దుస్థితి పాలమూరు ప్రజలది. నేడు ఆ పరిస్థితి మారింది. 7,500 రూపాయలు 50 లక్షల మందికి రైతు బంధు అందజేసినం.ఎంతటి ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆగటం లేదు.పాలమూరులో చిరు వ్యాపారులకు 250 మంది వీధి వ్యాపారులకు దుకాణాలు అందజేసినం. వ్యవసాయం ఊపందుకోవటంతో పాలమూరుకు రివర్స్ మైగ్రేషన్ మొదలైంది” అని కేటీఆర్ అన్నారు. కరోనా సమయంలో ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, వాక్సిన్ రావాలంటే మరో 6 నెలలు పట్టొచ్చ‌ని ఆయ‌న అన్నారు. ఓ వైపు సంక్షేమం … ఇంకో వైపు అభివృద్ది తో ముందుకు సాగుతున్నామ‌న్నారు.

Latest Updates