వైన్ షాపుల దగ్గరే తాగితే లైసెన్స్ రద్దు

  • అధికారులకు కేటీఆర్ ఆదేశం

మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని మంత్రి కేటీఆర్ అధికారుల‌కు ఆదేశమిచ్చారు. న‌గ‌రంలోని స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల‌ను గుర్తించి నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అన్నారు. బుద్ద‌భ‌వ‌న్‌లో పోలీసు, జీహెచ్ఎంసీ ఉన్న‌తాధికారుల‌తో జరిపిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. టోల్ ఫ్రీ నెంబ‌ర్ 100 పై విస్తృతంగా ప్ర‌చారం కల్పించాలని, మహిళల భద్రత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వైన్స్ షాపులు, దాని చుట్టుప్ర‌క్క‌ల ప్రాంతాల్లో మ‌ద్యం సేవించేవారిపై చ‌ర్య‌లు తీసుకోవాలని, నియమాలను ఉల్లంఘిస్తే సంబంధిత వైన్స్ షాపుల‌ను మూసివేయించాలని చెప్పారు. ఖాళీ స్థలాలు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని.. వాటిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

శ‌రవేగంగా అభివృద్ది చెందుతున్న హైద‌రాబాద్ రోడ్లను అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో అభివృద్ది చేస్తామని చెప్పారు కేటీఆర్. ట్రాఫిక్ వ్య‌వ‌స్థ‌ను శాస్త్రీయంగా క్ర‌మ‌బ‌ద్దీక‌రించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్ని రోడ్ల‌పై లైటింగ్‌ను పెంచుట‌కు అద‌నంగా మరిన్ని ఎల్‌.ఇ.డి లైట్ల‌ను ఏర్పాటు చేస్తామన్నారు..

ముంబయిలో 72శాతం ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగిస్తుంటే హైద‌రాబాద్‌లో ఆ శాతం 34 మాత్ర‌మే ఉందన్నారు. నగరంలోని వాహ‌నాల సంఖ్య ఐదేళ్ల‌లో 73 ల‌క్ష‌ల నుండి ఒక‌కోటి 20ల‌క్ష‌ల‌కు పెరిగిందన్నారు. ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌వైపు ప్ర‌జ‌ల‌ను మ‌ళ్లించుట‌కు ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను మెరుగు పర్చుతామన్నారు. రోడ్ల అభివృద్దిలో భాగంగా 709 కిలోమీట‌ర్ల ప్ర‌ధాన ర‌హ‌దారుల‌ను సి.ఆర్‌.ఎం.పి కింద ఈ నెల 9 నుండి ప‌నుల‌ను చేపట్టేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు.

రోడ్ల నిర్వ‌హ‌ణ స‌క్ర‌మంగా లేక‌పోవ‌డం వ‌ల్లే మ‌న దేశంలోని రోడ్డు ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జరుగుతున్నాయని, ట్రాఫిక్ సిగ్న‌లింగ్ వ్య‌వ‌స్థ‌ను కూడా ఆధునీక‌రించేందుకు నిధులు మంజూరు చేయాలని డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి అన్నారు.

ఈ సమీక్షకు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, మున్సిప‌ల్ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర్వింద్ కుమార్‌, జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ ‌లోకేష్ కుమార్‌, చీఫ్ ఇంజ‌నీర్, పోలీసు క‌మిష‌న‌ర్లు, అసిస్టెంట్ పోలీసు క‌మిష‌న‌ర్లు, జిహెచ్ఎంసి అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు హాజరయ్యారు.

Minister KTR instructs to officials focus exclusively on the security of women

Latest Updates