నిర్మాణ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మ‌ంత్రి కేటీఆర్

రాష్ట్రంలో‌ ప్రస్తుతం నెలకొన్న కరోనా సంక్షోభం నేపథ్యంలో హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని, దాని అభివృద్ధిని కొనసాగించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో కీలక అంశంగా ఉన్న నిర్మాణ రంగానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ మార్గనిర్దేశనంపై చ‌ర్చించేందుకు నిర్మాణ రంగ సంఘాల ప్రతినిధులతో శనివారం మంత్రి సమావేశమయ్యారు. స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ… హైదరాబాద్ అద్బుతమైన ప్రగతి సాధించాలన్నది తమ లక్ష్యమ‌ని చెప్పారు. హైదరాబాద్ వృద్దిలో భాగస్వాములు కావాలని మంత్రి నిర్మాణ రంగ సంఘాల ప్రతినిధులను కోరారు.

దేశంలో ఉన్న ఇతర మెట్రో నగరాల్లో నిర్మాణ రంగ పరిస్థితి అయోమయంలో ఉన్న పరిస్థితుల్లోనూ హైదరాబాద్ నగరంలో మాత్రం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిర్మాణ రంగ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ కి తెలిపారు. ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలో ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న ఉపశమన చర్యలు పైన వారు మంత్రితో చర్చించారు. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ అప్రూవల్, మాస్టర్ ప్లాన్ అంశాలపైన ఈ సందర్భంగా మంత్రి దృష్టికి పలు అంశాలను తీసుకువచ్చారు. వారు చేసిన సూచనలపై సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్, నిర్మాణ రంగానికి అండగా ఉంటామన్నారు. ప్రస్తుతం వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న నిర్మాణ రంగాన్ని ఆదుకోవాల్సి అవసరాన్ని తాము గుర్తిస్తున్నామని , నిర్మాణ‌ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇసుక సరఫరాకు ఇబ్బందులు ఏదురవుతున్నాయన్నని పలువురు మంత్రి దృష్టికి తేవడంతో టియస్ యండిసి ఏండి మల్సూర్ తో మాట్లాడి హైదరాబాద్ నిర్మాణ రంగానికి సరిపడా ఇసుక నిల్వలుండేలా చూడాలని, నగరంలో ఉన్న స్టాక్ యార్డులనుంచి వీటి సరఫరా జరిగేలా చూడాలని సూచించారు. నిర్మాణ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల పూర్తి వివరాలు సేకరించాలని, నిర్మాణరంగ కార్మికుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ తెలిపారు. సంక్షోభ సమయంలో అతిధి కార్మికుల విషయంలో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలతో పాటు కలిసి వచ్చిన నిర్మాణ సంస్థల ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.

Latest Updates