రెండు, మూడేళ్లలో సిరిసిల్లకు రైలు.. మేనిఫెస్టోను విడుదల చేసిన కేటీఆర్

దేశంలోనే బెస్ట్ మున్సిపాలిటీగా సిరిసిల్లను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్‌. సిరిసిల్లకు త్వరలో రైలు మార్గం రావాలని.. రెండు, మూడేళ్లలో రైలు మార్గం రావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం ఆయన సిరిసిల్ల మున్సిపాలిటీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిరిసిల్లలో ఓటు అడిగే హక్కు కేవలం టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల తరుణంలో రాబోయే వారం రోజులు కార్యకర్తలు, నాయకులు కష్టపడాలన్నారు. అంతా బాగుందనే అతి విశ్వాసాన్ని వీడి  ఇంటింటికి వెళ్ళి. ప్రజలను కలిసి దండం పెట్టి ఓట్లడగాలన్నారు.

జేఎన్‌టీయూ కళాశాల ఏర్పాటు చేస్తాం

సిరిసిల్ల ప్రాంతాన్ని విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్‌ కళాశాల కూడా వచ్చేలా కృషి చేస్తానన్నారు. సిరిసిల్లలో 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపించామని చెప్పారు. సిరిసిల్లను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని చెప్పారు. ఇప్పటికే ఎన్నో జాతీయ అవార్డులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. కారు గుర్తుకు ఓటేస్తేనే తమను ఆశీర్వదించినట్లని చెప్పారు. అభ్యర్థులంతా నిద్రహారాలు లేకుండా ఈ వారం రోజులు పనిచేయాలన్నారు.

ప్రతిపక్షాలతో అయ్యేదేమీ లేదు

ప్రతిపక్షాలకు చెప్పుకునేందుకు ఏమీ లేదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ చెయ్యగలిగిందేమీ లేదని, బీజేపీ చేసేదేమీ లేదన్నారు. అడ్డిమారి గుడ్డి దెబ్బలాగా కరీంనగర్ ఎంపీ స్థానాన్ని బీజేపీ గెలుచుకుందని, వాళ్ళతో అయ్యేదేమీ లేదని చెప్పారు.

పనిచేయకపోతే  పదవి ఫట్

పరకాల, చెన్నూరు పురపాకల సంఘాలను ఇప్పటికే ఏకగ్రీవంగా గెలుపొందామని కేటీఆర్.. ఏకగ్రీవంగా ఎన్నికైన నలుగురు కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఏక గ్రీవంగా గెలిచిన వాళ్లు మిగతా వార్డుల్లో ప్రచారం చేయాలని చెప్పారు. గెలిచిన తర్వాత పనిచేయకపోతే  వారిని పదవి నుంచి తొలగించేలా కొత్త చట్టం తెచ్చామని, ఒకవేళ పదవులు పోతే తన బాధ్యత కాదని చెప్పారు. కొత్త మున్సిపల్ చట్టంపై పాలక వర్గాలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అవినీతి రహిత పాలన, స్వచ్ఛ పట్టణాలే తమ లక్ష్యమని ,  మరో రాబోయే నాలుగేళ్లు ఏ ఎన్నికలు లేవని,  “పుర పాలన, పరిపాలనే” లక్ష్యంగా పని చేయాలన్నారు. ఎన్నికల్లో విజయానికి నేతలంతా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్.

minister KTR released Sirsilla Manifesto

Latest Updates