హైద‌రాబాద్ రోడ్ల విస్తరణ‌పై మంత్రి కేటీఆర్ స‌మీక్షా స‌మావేశం

  • భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి మైక్రో ప్లానింగ్ చేయాల‌ని ఆదేశం
  • నగరాన్ని నాలుగు జోన్లుగా విభజించుకొని నివేద‌క ఇవ్వాల‌ని సూచన
  • ఒక నెల రోజుల్లో నివేదికను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందికి ఆదేశం

హైదరాబాద్ నగర రోడ్ల పైన సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి కేటిఆర్. ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్ కి అనుగుణంగా రోడ్ల విస్తరణ మరియు రోడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సమీక్షా సమావేశంలో మంత్రి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరాన్ని నాలుగు జోన్లుగా విభజించుకొని, ఒక్కో జోన్ పై ఉన్న ప్రస్తుత‌ రోడ్లతోపాటు భవిష్యత్తులో ఏర్పాటు చేయాల్సిన రోడ్ల నిర్మాణము, ప్రస్తుత రోడ్ల విస్తరణ వంటి కార్యక్రమాలు అన్నింటి పైన ఒక సునిశిత‌మైన నివేదిక అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నివేదికలో ప్రస్తుతం ఉన్న రోడ్ల తో పాటు భవిష్యత్తులో రోడ్ల పైన ఏర్పడేటువంటి జంక్షన్ల అభివృద్ధి, బస్సు బే ల నిర్మాణము, టాయిలెట్ నిర్మాణం వంటి ప్రతి అంశానికి సంబంధించి సమాచారం ఉండాలన్నారు. ఈ నివేదిక తయారీ కోసం రోడ్డు నిర్మాణ కన్సల్టెంట్ లతో, సంస్థతో కలిసి పని చేసి నెలరోజుల్లోగా ఒక ప్రాథమిక నివేదికను సిద్ధం చేయాలని సూచించారు.

హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న ప్రతి వంద ఫీట్ల రోడ్డు పైన ఖచ్చితంగా ఒక మీడియన్ మరియు గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగర కమిషనర్ లోకేష్ కుమార్ కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. నూతన రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఎస్ ఆర్ డి, హెచ్ ఆర్ డి సి ఎల్ మరియు సి ఆర్ ఎం పీ కింద చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రోడ్ల పైన జోనల్ కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించి ఆదేశాలు జారీ చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ కు కేటీఆర్ సూచించారు.

.

Latest Updates