హైదరాబాద్ తో పాటు మరిన్ని ప్రాంతాలకు ఐటీ, పరిశ్రమలు

హైదరాబాద్ తో పాటు మరిన్ని ప్రాంతాలకు ఐటీ, పరిశ్రమలు విస్తరించేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీ అండ్ ఇండస్ట్రీస్ పై సమీక్ష నిర్వహించారు కేటీఆర్. సిటీతో పాటు టూటైర్ సిటీల్లో ఐటీని విస్తరించడం, పారిశ్రామికవేత్తల నుంచి మరిన్ని పెట్టుబడులు రాబట్టడం లాంటి అంశాలపై చర్చించారు. ఐటీ పార్కుల నిర్మాణానికి  ముందుకొచ్చే కంపెనీలకు.. పూర్తి సహకారం అందించాలని అధికారులకు సూచించారు.

ఐటీ పరిశ్రమలను హైదరాబాద్ తో పాటు ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించే కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్. సీఎం క్యాంప్ ఆఫీస్ లో TSIIC చైర్మన్ బాలమల్లుతో పాటు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో.. ద్వితీయశ్రేణి నగరాల్లో ఐటీ రంగ విస్తరణపై చర్చించారు మంత్రి. ఇప్పటికే మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ నగరాలకు ఐటీ పరిశ్రమలను విస్తరించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు కేటీఆర్. సోమవారం ఖమ్మంలో ఐటీ టవర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

వరంగల్ నగరానికి ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు వచ్చాయని మంత్రి తెలిపారు. రెండో దశలో మరిన్ని ఐటీ కంపెనీలు.. తమ సంస్థలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.  అందుకు సంబంధించి అవసరమైన మౌలిక వసతులు, ఇతర సదుపాయాల కల్పన కోసం.. TSIIC చేపడుతున్న కార్యాచరణపై చర్చించారు మంత్రి.

ద్వితీయశ్రేణి నగరాలతో పాటు హైదరాబాద్ శివారులో ఐటీ పరిశ్రమలు విస్తరించాలన్న ఉద్దేశంతో.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రోత్ ఇన్ డిస్ పర్షన్  పాలసీకి.. మంచి స్పందన లభిస్తోందన్నారు కేటీఆర్. ఉప్పల్, నాచారం లాంటి ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఐటీ పార్కుల నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న కార్యాచరణను తెలుసుకున్నారు. ఐటీ పార్కుల నిర్మాణానికి  ముందుకొచ్చే  కంపెనీలకు.. పూర్తి సహకారం అందించాలని అధికారులకు సూచించారు. కొంపల్లిలో ఐటీ పార్క్ నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూసేకరణ.. త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మహబూబ్ నగర్ దివిటిపల్లిలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, వాటికి సంబంధించి  పూర్తి వివరాలను.. త్వరలోనే ప్రకటిస్తామని కేటీఆర్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో అగ్రస్థానాన్ని సాధించేందుకు.. పరిశ్రమల శాఖ కృషి చేస్తున్నట్లు అధికారులు కేటీఆర్ కు తెలిపారు.

 

Latest Updates