లైఫ్ సైస్సెస్ మన రాష్ట్రమే టాప్

లైఫ్ సైస్సెస్ మన రాష్ట్రమే టాప్

హైదరాబాద్, వెలుగులైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని మంత్రి కేటీఆర్​ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఫార్మా, బయోటెక్​ పరిశ్రమను 50 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యమన్నారు. లైఫ్​ సైన్సెస్​ రంగంలో వచ్చే దశాబ్దంలో కొత్తగా 4 లక్షల ఉద్యోగాలను సృష్టించడంపై దృష్టి సారించామని చెప్పారు. సోమవారం హైదరాబాద్​లోని హెచ్ఐసీసీలో ప్రారంభమైన 17వ బయోఏషియా–2020 సదస్సుకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో 35% వాటా హైదరాబాద్​దేనని అన్నారు. అతి పెద్ద ఫార్మా సిటీ హైదరాబాద్​లో ఏర్పాటు చేశామని, వరల్డ్​ బయో క్లస్టర్​గా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆసియాలో అతిపెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటైన జీనోమ్ వ్యాలీని విస్తరిస్తామని, ఇందుకోసం జీనోమ్ వ్యాలీ 2.0 మాస్టర్‌ప్లాన్ రూపొందించామని తెలిపారు. సింజిన్​ కంపెనీ బెంగళూర్​ తర్వాత హైదరాబాద్​లోని జీనోమ్ వ్యాలీకి రూ.170 కోట్లతో తొలిదశలో విస్తరించడం సంతోషకరమన్నారు. జీవీకే బయో, సాయి లైఫ్​ సైన్సెస్​తోపాటు ఎన్నో కంపెనీలు హైదరాబాద్​ను గ్లోబల్​ఆర్​ అండ్​ డీ హబ్​గా మార్చాయని, సింజీన్ రాకతో ఆ స్థానం మరింత పటిష్టమవుతుందన్నారు. లైఫ్ సైన్సెస్ గ్రిడ్ కింద హైదరాబాద్ ఫార్మా సిటీని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని, పారిశ్రామిక నగరాలకు ఒక నమూనాగా ఈ ఫార్మాసిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ కూడా తమ ఇండియా ఔట్​పోస్టు ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.

వరల్డ్​ వ్యాక్సిన్​ క్యాపిటల్​గా హైదరాబాద్

వరల్డ్​ వ్యాక్సిన్​ క్యాపిటల్​గా హైదరాబాద్​ అభివృద్ధి చెందిందని, ప్రపంచానికి కావాల్సిన మూడో వంతు వ్యాక్సిన్​ ఇక్కడి నుంచే సరఫరా అవుతోందని కేటీఆర్​అన్నారు. తక్కువ ధరలో ఔషధ ఉత్పత్తులను తయారు చేయాలని సైంటిస్టులు, పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. దేశంలోనే అతిపెద్ద మెడికల్​ డివైసెస్​ పార్కును హైదరాబాద్​లో 276 ఎకరాల్లో ఏర్పాటు చేశామని, ఇప్పటికే 20కిపైగా కంపెనీలు డివైసెస్​ తయారీని, ఆర్​అండ్ డీ యూనిట్లను ఏర్పాటు చేశాయని తెలిపారు. ఆసియాలో అతిపెద్ద స్టంట్​తయారీ కంపెనీ సహజానంద్​ మెడికల్​ టెక్నాలజీస్​ తన డెస్టినేషన్​గా హైదరాబాద్​ను ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమ్మిట్​లో వైద్య పరికరాలు, హెల్త్‌టెక్‌పై దృష్టి సారించామని, ఈ రంగంలో ఉన్న అవకాశాలపై చర్చించడానికి మెడీటెక్ కంపెనీల లీడర్స్ సమావేశం అవుతారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. సదస్సులో స్విట్జర్లాండ్ రాయబారి డాక్టర్ ఆండ్రియాస్ బామ్, లండన్​ స్కూల్​ ఆఫ్​ హైజీన్​అండ్​ ట్రోపికల్ మెడిసిన్ ప్రతినిధి​డాక్టర్​ పీటర్​ పియట్, సింజీన్​ సీఎండీ కిరణ్​ మజూందర్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ జయేశ్​ రంజన్, బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్, డాక్టర్​ రెడ్డీస్ ఫార్మా సీఎండీ సతీష్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, కేన్సర్​ ట్రీట్​మెంట్​కు పేరుగాంచిన కార్-టీ థెరపీకి ఆద్యుడు డాక్టర్ కార్ల్ జూన్‌కు ఈ ఏడాది జీనోమ్​ వ్యాలీ ఎక్స్​లెన్స్​ అవార్డును కేటీఆర్​ అందజేశారు. 75 స్టార్టప్​ కంపెనీలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్స్​ను కేటీఆర్​ ప్రారంభించారు.

బయోలాజికల్​ ఈ లిమిటెడ్​ ప్రారంభం

జీనోమ్ వ్యాలీలో సోమవారం ప్రారంభించిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ వ్యాక్సిన్ కొత్త యూనిట్ వల్ల వెయ్యి మందికి ఉపాధి కలగనుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. రూ.300 కోట్ల ఖర్చుతో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్​ తో కొత్త వ్యాక్సిన్లు కనుగొనే అవకాశం ఉందన్నారు. జీనోమ్ వ్యాలీలో ఎంఎన్ పార్క్ పేరుతో కొత్త ల్యాబ్ బిల్డింగ్​ను ప్రారంభించినట్లు మరో ట్వీట్ చేశారు. సిన్ జెనిటల్ ప్రారంభంతో ఆసియాలో లైఫ్ సెన్సస్ క్లస్టర్ గా జీనోమ్ వ్యాలీ నిలవనుందని కేటీఆర్ మరో ట్వీట్ లో పేర్కొన్నారు.