LRS‌ దరఖాస్తు దారులకు కాస్త ఊరట

హైదరాబాద్: రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులు తగ్గిస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం వేయమని, రిజిస్ట్రేషన్‌ చేసిన సమయంలో ఉన్న ధర మేరకే ఫీజులు తీసుకుంటామని తెలిపారు. లేఅవుట్ల క్రమబద్ధీకరణ ఫీజు ఎక్కువగా ఉందన్న ప్రజల ఫిర్యాదులపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ క్రమంలోనే ఎల్ఆర్ఎస్ పై ఇటీవల జారీ చేసిన 131 జీవోను సవరిస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. సవరించిన జీవోను గురువారం నుంచి విడుదల చేస్తామని చెప్పారు కేటీఆర్.

వచ్చే అక్టోబర్‌ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకున్న వారు క్రమబద్ధీకరణ ఫీజును వచ్చే ఏడాది జనవరి 31లోపు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ స్థలాలు, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ మిగులు భూములు, దేవాదాయ భూములు, చెరువుల శిఖం భూముల్లోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ వర్తించదన్నారు మంత్రి కేటీఆర్.

అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ప్రజలకు ఎల్‌ఆర్‌ఎస్‌ గుబులు పట్టుకుంది. ఎప్పుడో కొని, రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకున్న స్థలాలకు ఇప్పుడు రూ.లక్షల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ను చెల్లించాలనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో స్థలం కొనుక్కొని, వీలైతే చిన్న ఇల్లు కట్టుకుని ఉంటున్న వారికి ఎల్‌ఆర్‌ఎ్‌స్‌ పిడుగుపాటులా మారిందంటున్నారు ప్రజలు.

Latest Updates