రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేటలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలసి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరో విడత హరితహారంలో భాగంగా ఆవునూరు – వెంకటాపూర్ మానేరు ఒడ్డున మొక్కలు నాటి మెగా ప్లాంటేషన్ కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని చెరువులు, నదులు, కుంటల పక్కన మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆరో విడత హరితహారం పండుగ వాతావరణంలో జరుగుతోంది… సిరిసిల్లలో 19.85 శాతం అడవులు ఉన్నాయి.. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు 33 శాతానికి అడవులను పెంచాలని కోరారు. సీఎం కేసీఆర్ సంకల్పం హరిత తెలంగాణలో మనమందరం భాగస్వాములమవుదాం అని పిలుపునిచ్చారు. సాగునీటి కి ఇబ్బంది లేకుండా ఎగువ మానేరు నుంచి మద్య మానేరు వరకు 11 చెక్ డ్యామ్ లు నిర్మిస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోటి 40 లక్షల మొక్కలు సిద్దం గా ఉంచామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం.. కరోనా సంక్షోభంలోనూ రైతును రాజు చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కరోనా సంక్షోభం లోనూ రైతుబంధు పథకాన్ని ఆపలేదు.. ఎకరానికి రూ.5 వేల చొప్పున దాదాపు 7 వేల కోట్లు ఇచ్చామన్నారు. వ్యవసాయంలో కొత్త హరిత విప్లవం రావాలి.. పాడి పంటలతో పాటు మత్స్య పరిశ్రమ కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేశాం .. తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా మారింది.. సిరిసిల్ల నియోజకవర్గాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కట్టుబడి ముందుకు వెళ్తున్నా అని చెప్పారు మంత్రి కేటీఆర్.

Latest Updates