హైదరాబాద్-విజయవాడ హైవే కి రూ.500 కోట్లు కేటాయించండి

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కేటీఆర్ లేఖ

హైదరాబాద్ నగరానికి అత్యంత కీలకమైన హైదరాబాద్ – విజయవాడ హైవే విషయంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు తొలగించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు 500 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించాలని కోరుతూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి లేఖ రాశారు మంత్రి కేటీఆర్ . హైదరాబాద్ నగరానికి అత్యంత కీలకమైన విజయవాడ -హైదరాబాద్ హైవే.. నగర పరిధిలో సుమారు 25 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నదని తను రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

అయితే హైదరాబాద్ లో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉన్న ఈ హైవేకు ప్రత్యేకంగా లెవెల్ జంక్షన్లు, సర్వీస్ రోడ్డు వంటి సౌకర్యాలు లేవని, లెన్ కెపాసిటీ మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో ఈ రోడ్డుని మరింతగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ 500 కోట్ల రూపాయలతో డీటెయిల్ ప్లానింగ్ రిపోర్ట్ డిపిఆర్ తయారు చేసిందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం పెరుగుతున్న విస్తరణకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌళిక వసతుల కల్పన కోసం ప్రాజెక్టులు చేపట్టిందని మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేక చొరవతో హైదరాబాద్ నగరానికి 4 అర్బన్ ప్రాజెక్ట్ లు వచ్చాయని అందులో మూడు ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. త్వరలోనే అంబర్ పేట ఫ్లైఓవర్ కి సంబంధించిన పనులు కూడా ప్రారంభమవుతాయని మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి గడ్కరీకి తెలియ జేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ వంటి కార్యక్రమాలకు  పూర్తిగా రాష్ట్ర నిధులను ఖర్చు చేస్తుందని గుర్తు చేశారు.

Latest Updates