వాచ్ మెన్ పై దాడి: నాకెలాంటి సంబంధం లేదంటున్న మంత్రి

సికింద్రాబాద్: బోయిన్ పల్లి లోని భూ వివాదం లో వాచ్ మెన్ పై జరిగిన పెట్రోల్ దాడి ఘటనలో తనకూ, తన అల్లుడికీ ఎలాంటి సంబంధం లేదన్నారు  కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. ఆ విషయంలో తాము తలదూర్చ లేదని స్పష్టం చేశారు. తమ వద్దకు అనేక మంది నాయకులు, కార్యకర్తలు వస్తుంటారని.. ప్రకాష్ రెడ్డి, మాధవరెడ్డి లు కూడా అలాగే వచ్చి కలిశారని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయిన సందర్భంగా బోయిన్ పల్లిలోని తన కార్యాలయంలో కేక్ కట్ చేశారు మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ఆ దాడి ఘటనతో తమకెలాంటి సంబంధం లేదన్నారు. ప్రస్తుతం తన దృష్టంతా మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధి పైనే ఉందని పేర్కొన్నారు. తన నియోజకవర్గం కోసం దాదాపు 90 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. 6 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ట్లు తెలిపారు.

జవహర్ నగర్ కు 24 కోట్లు,ఫీర్జాది గూడ కు 23 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కోసం 144 కోట్లతో కేంద్ర ప్రభుత్వ నిధులతో రాంకీ సంస్థ తో కలిపి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్నీ అతి త్వరలో ప్రారంభిస్తామని అన్నారు.గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పరిస్థితి దారుణంగా తయారైందని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ వద్దా దుర్వాసన రాకుండా అనేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు మల్లారెడ్డి.

Latest Updates