పొలిటికల్ ఎగ్జామ్ లో ఫెయిలైన చదువుల మంత్రి

హైదరాబాద్: మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సరూర్ నగర్, RK పురం డివిజన్లు మొదటి నుండి అచ్చిరావడం లేదని మరోసారి స్పష్టమైందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆమెను రెండు డివిజన్ల ప్రజలు ఆదరించడం లేదన్నది ఈ ఫలితాల్లో తేలిదంటున్నారు.  ఇప్పటివరకు రెండు డివిజన్లకు మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ అభ్యర్థులు ఓటమిని చవిచూశారు. ఈ రెండు డివిజన్లకు 2009లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రి. రెండు డివిజన్లలోనూ ఆమె పార్టీ అభ్యర్థులు గెలుపొందలేదు. రెండు డివిజన్లలోనూ టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. 2016లోనూ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల అభ్యర్థులు గెలువలేదు. సరూర్ నగర్ ను TRS, RK పురంను బీజేపీ కైవసం చేసుకుంది.

తాజాగా… కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది TRSలో చేరి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సబితా ఇంద్రారెడ్డికి ఈ సారి కూడా చేదు అనుభవమే ఎదురైందంటున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె పార్టీ అభ్యర్థులు రెండు డివిజన్లలో ఓటమిని చవిచూశారు. సరూర్ నగర్, RK పురం డివిజన్లను బీజేపీ కైవసం చేసుకోవడం మంత్రి సబితకు మింగుడు పడని అంశం అంటున్నారు. 2018లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ సబితా ఇంద్రారెడ్డికి రెండు డివిజన్లలో ఆధిక్యత రాలేదు. అక్కడ అప్పుడు TRS పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మీరుపేట, జిల్లెలగూఢ ప్రాంత కౌంటింగ్ కు వచ్చేసరికి ఆమె ఆధిక్యత పెరిగింది.  అంటే సబిత వైపు రెండు డివిజన్ల ఓటర్లు ఆదరణ చూపడం లేదన్నది ఈ ఎలక్షన్ తో మరోసారి తేలిదంటున్నారు.

Latest Updates