
మహబూబాబాద్ జిల్లా : జిల్లాలోని అమనగల్ గ్రామంలో శనివారం రాత్రి విద్యుత్ షాక్ తో మృతి చెందిన వారి కుటుంబాలను రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. శనివారం దండెంపై బట్టలు ఆరేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి విద్యుత్ షాక్ గురయ్యాడు. అతన్ని కాపాడబోయిన భార్యతో పాటు చూసేందుకు వెళ్లిన దంపతులు సైతం కరెంట్ షాక్తో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని, మృతుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.
ప్రమాదంపై సీఎంఓ, ట్రాన్స్కో, జిల్లా అధికారులతో మాట్లాడానని అన్నారు. విద్యుత్ శాఖ తరుపున ఒక్కో వ్యక్తికి 5 లక్షల రూపాయల చొప్పున కుటుంబానికి పది లక్షలుగా రెండు కుటుంబాలకు 20 లక్షల రూపాయల నష్ట పరిహారం అందుతుందన్నారు. మరణించిన వారు రైతులు కనుక రైతు భీమా ద్వారా ఒక్కో కుటుంబానికి మరో 5 లక్షల చొప్పున రెండు కుటుంబాలకు 10 లక్షల ఆర్ధిక సాయం అందేలా చూస్తామన్నారు. ఈ సంఘటన ను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం అందేలా కృషి చేస్తామని మంత్రి చెప్పారు.