గండ్లు కాలువలకు, చెరువులకు పడకపోతే మనుషులకు పడతాయా ?

కాలువలకు ,చెరువులకు గండ్లు పడక పోతే మనుషులకు పడతాయా ? అంటూ విప‌క్షాల‌పై మండిప‌డ్డారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. శుక్ర‌వారం అసెంబ్లీ పాయింట్ వ‌ద్ద మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. “మీరు కాల్వలు తవ్వలేదు కనుకే గండ్లు పడలేదు.కాంగ్రెస్ హాయం లో కాలువల కోసం తట్టెడు మన్ను తీయలేదు గనుకే గండ్లు కూడా పడలేదు.” అని కాంగ్రెస్ నాయ‌కుల‌పై ఫైర్ అయ్యారు. ‘డెబ్బయ్ సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించినోళ్లు ,తెలంగాణ కు అడ్డుపడ్డ వాళ్ళు.. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ను తెచ్చిన మా ప్రభుత్వాన్ని విమర్శించడమా ?’ అని ప్ర‌శ్నించారు.తెలంగాణ అంతటా కాలువల్లో నీళ్లు కనిపిస్తున్నాయని, చిన్న చిన్న గండ్లు కూడా సహజమేన‌ని అన్నారు. .వర్షాకాలం చెరువులకు గండ్లు పడటం -పూడ్చడం సహజమేన‌న్నారు. కాంగ్రెస్ నాయ‌కులు కొండ పోచమ్మ ప్రాజెక్టు చిన్న కాలువ కు గండి పడితే అదొక వింత అన్నట్టుగా మాట్లాడుతున్నారన్నారు.

బీజేపీ నేత రామ్ మాధవ్ తెలంగాణ కు పొలిటికల్ టూరిస్టుగా వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. సగం సగం ప్రాజెక్టులు కట్టారని అర్ధ రహితంగా మాట్లాడార‌ని దుయ్య‌బ‌ట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎం లు ,కేంద్ర మంత్రులు తెలంగాణ ప్రాజెక్టులను మెచ్చుకున్నారనే విషయం రామ్ మాధవ్ కు తెలియదా ? అని ప్ర‌శ్నించారు. కెసిఆర్ ను ప్రజలు ఇంటికి సాగనంపే రోజు దగ్గర్లోనే ఉందని రామ్ మాధవ్ మాట్లాడటాన్ని తాము ఖండిస్తున్నామ‌న్నారు.

ప్రాజెక్టులపై రాజకీయాలు తగవు

సీఎం కెసిఆర్ కు కొండ పోచమ్మ కాలువ గండి కి సంబంధం ఏంట‌ని ప్ర‌శ్నించారు శ్రీనివాస్ గౌడ్. చైనా సరిహ‌ద్దుల్లో 20 మంది సైనికులు చనిపోతే మేము మోడీ ని బాధ్యుడిని చేశామా ? అని అన్నారు. సరిహద్దు జాతీయ భద్రత అంశం అయితే ప్రాజెక్టులు తెలంగాణ భద్రత సమస్య అన్నారు. స‌ర్దార్ సరోవర్ ప్రాజెక్టు కాలువలకు గండి పడితే అప్పటి సీఎం మోడీ ది తప్పా ? అని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళొచ్చాయని ప్రజలు సంబర పడుతుంటే ప్రతి పక్షాలు విషం గక్కుతున్నాయని, శత్రువుల్లా శాపం పెడుతున్నాయన్నారు. తెలంగాణ లో ప్రాజెక్టులు కట్టలేదంటున్న రాం మాధవ్ 2014 కు ముందు ఇప్పటి శాటిలైట్ మ్యాపులు తెప్పించుకుని చూడాల‌న్నారు.

 కేసీఆర్ తెలంగాణ ప్రజల పాలిట దేవుడు

కేసీఆర్ ను, కేటీఆర్‌ను దూషిస్తే తెలంగాణ ప్రజలు సహించర‌ని మంత్రి అన్నారు. సైన్యం లో పని చేసిన ఉత్తమ్ జ్ఞానాన్ని పెంచుకుని మాట్లాడాలి తప్ప ఎవరో చెబితే మాట్లాడొద్దని హిత‌వు ప‌లికారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే శక్తులను తాము అడ్డుకుంటామ‌ని చెప్పారు. ప్రతి దాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయాలనుకుంటే ప్రజలే బుద్ది చెబుతారని, కుళ్ళు విమర్శలు మానుకుంటే ప్రతిపక్షాలకే మంచిదని చెప్పారు.

Latest Updates