హైదరాబాద్ లో విష జ్వరాలపై మంత్రి తలసాని వెటకారం

హైదరాబాద్ లో ప్రబలుతున్న విష జ్వరాలపై రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా వెటకారంగా మాట్లాడారు. ఈ స్థాయిలో విష జ్వరాలు రాకముందే.. ముందస్తుగా ప్రభుత్వం ఎందుకు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఆయన సహనం కోల్పోయారు. మనిషికి బిడ్డ పుట్టకముందే అన్నీ చేస్తామా అంటూ వెటకారంగా ఆయన బదులిచ్చారు.

గాంధీ హాస్పిటల్ లో జ్వర బాధితులు చికిత్స తీసుకుంటున్న వార్డులను మంత్రి తలసాని పరిశీలించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా ఇవాళ గాంధీ హాస్పిటల్ ను సందర్శించనున్నారు. ఈటల కంటే ముందే హాస్పిటల్ కు వెళ్లారు మంత్రి తలసాని.

సినిమా టికెట్ల లైన్ లో చనిపోయినవారికి సినిమాతో సంబంధం లేదంటూ.. యూరియా కోసం చనిపోయిన రైతును ఉద్దేశించి మంత్రి నిరంజన్ రెడ్డి వెటకారం చేసిన మర్నాడే … మంత్రి తలసాని జ్వరాలపై ఇలాంటి వెటకారపు కామెంట్స్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

వాతావరణంలో మార్పుల  కారణంగా వ్యాధులు వస్తున్నాయనీ రోగులకు సరైన సేవలు అందించేందుకు డాక్టర్లు, ప్రభుత్వం పూర్తిగా కృషి చేస్తోందని చెప్పారు తలసాని. ఒకే పడక మీద ఇద్దరు రోగులకు చికిత్స అని రాయడం సరికాదనీ… పరిస్థితుల కారణంగా ఇలా జరుగుతుందని వివరణ ఇచ్చారు. దేశమంతటా ఉన్న పరిస్థితులు చూస్తే  తెలంగాణలో మెరుగైన వైద్యమే అందుతోందని అన్నారు. హాస్పిటల్స్ కి అత్యంత ప్రయారిటీ ఇస్తున్నామనీ.. అన్ని చోట్లా మందులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని అన్నారు. మీడియా వాస్తవాలను చూపించాలని కోరారు. “డెంగీ జ్వరాలను ఉన్నదానికంటే ఎక్కువగా చేసి చూపించొద్దు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. పరిస్థితిని పబ్లిసిటీ కోసం వాడుకోవడం సరికాదు” అని అన్నారు మంత్రి తలసాని.

Latest Updates