బీజేపీ నేతలవి గాలి మాటలు

హైదరాబాద్: బీజేపీ నేతలవి గాలి మాటలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కనీసం ఏది ఎవరి పరిధిలో ఉంటుందో బీజేపీ నేతలకు తెలియక పోవటం సిగ్గుచేటు అన్నారు. ఎల్ఆర్ఎస్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉంటుందా..  బీజేపీ వాళ్ళు ఎలా రద్దు చేస్తారన్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని..ప్రధాని మోడీ భారత్ బయోటెక్ కు వస్తున్నారంటే ..ఇప్పటికైనా హైదరాబద్ ఫార్మా హబ్ అని ఒప్పుకుంటారా అన్నారు. బండ్లు, ఆటోలకు చలాన్ తీసేస్తరట.. ఎట్లా తీసేస్తారన్నారు. పేదలకు వంద యూనిట్స్ కు ఫ్రీ కరెంట్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉందా అన్నారు.

ఊమెన్ పోలీస్ స్టేషన్ కూడా జీహెచ్ఎంసీ కడుతుందా అన్న తలసాని..ఉచితంగా ట్యాబ్ లు ఇవ్వటం, ప్రైవేటు స్కూల్స్ ఫీజులు నియంత్రణ జీహెచ్ఎంసీ  చేతుల్లో ఉంటుందా అని ప్రశ్నించారు. మూసీ రివర్ ప్రక్షాళన ఒక్క రోజులో క్లీన్ అయ్యేది కాదని.. ఇది కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఉంటుందా అన్నారు. పరిపాలన అనుభవం లేని నాయకులు తయారు చేసిన మ్యానిఫెస్టో బీజేపీదని.. దిమాక్ లేనొల్లు తయారు చేశారన్నారు. ఎన్టీఆర్, పీవీ నరసింహారావులు బీజేపీ పార్టీ వాళ్ళా.. వారి ఘాట్ ల వద్దకు బండి సంజయ్ ఎందుకు పోయిండన్నారు. రేపు హైదరాబాద్ కు వచ్చే ప్రధాని మోడీ వరద బాధితులకు 25 వేలు ఇచ్చే జీఓ తీసుకొని రావాలన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న సర్వేలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

Latest Updates