మన పోలీస్ వ్యవస్థ దేశానికే గర్వకారణం: మంత్రి తలసాని

Minister Talasani Srinivas yadav talks about police system in Telangana state

దేశం గర్వపడే విధంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉగ్రవాద మూలాలున్నాయనే అనుమానమున్న ప్రతీ చోట పోలీస్ వ్యవస్థ తనిఖీలు చేస్తుందన్నారు.  తెలంగాణ పోలీసుల సహకారంతోనే ఇటీవల హైదరాబాద్ నగరంలో  ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాద సంస్థ సానుభూతి పరులను అరెస్ట్ చేశారని ఆయన అన్నారు.

బీజేపీ ప్రతి అంశాన్ని ఎంఐఎం తో ముడిపెట్టి మాట్లాడటం తగదని హెచ్చరించారు. ప్రతి అంశంలోను ఎంఐఎం ను  దోషిగా చూపడం సరికాదన్నారు. బిజెపి నేతలు ఇష్టానుసారంగా మాట్లాడటం పోలీస్ ల మనో స్థైర్యాన్ని దెబ్బతీయటమేనని మంత్రి అన్నారు. అసలు దేశంలో ఉగ్రవాదం పెరగటానికి బీజేపినే కారణమని, మతాన్ని అడ్డు పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తుందని ఆయన అన్నారు. ఇటీవల పాక్ చేతిలో బందీ అయి విడుదలైన అభినందన్ విషయంలో  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాక్ పై చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యమని అన్నారు. అభినందన్ ను వదలకపోతే పాకిస్తాన్ కు కాలరాత్రి అని మోదీ మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు.

ఇక పార్టీ ఫిరాయింపులపై మేధావుల్లా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, భట్టీలు.. కాంగ్రెస్ హయాంలో ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. బ్యాలెట్ అయితే బాగుంటుందని మాట్లాడుతున్న ఉత్తమ్…ఈవిఎంలతో గెలిచారని గుర్తు చేశారు.17 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్..ఎక్కడ కూడా తమకు కనీసం పోటీ ఇవ్వలేదని అన్నారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు.కాంగ్రెస్ నేతలు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుంటే చాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తమ పాలన బాగుంది కాబట్టే తిరిగి తమ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. దమ్ముంటే ప్రజా క్షేత్రంలో కొట్లాడండని సవాల్ చేశారు. ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వం ఓ కమిటీని వేసిందని, నివేదిక వచ్చాక ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మిషన్ భగీరథ నూటికి నూరు శాతం పూర్తయిందన్నారు.

Latest Updates