ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీస్ నిర్మాణం

ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీస్ నిర్మాణం

 

  •     డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి ప్రశాంత్ రెడ్డి రివ్యూ
  •     ప్రభుత్వ స్థలాలు పరిశీలించి రిపోర్టు ఇవ్వాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఉన్న విధంగా హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీసులు నిర్మించాలని సీఎం నిర్ణయించారని ఆర్ అండ్‌ బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీసుల నిర్మాణంపై సిటీలోని మంత్రులు, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలతో ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంగళవారం సమావేశమయ్యారు. క్యాంపు ఆఫీసుల నిర్మాణంతో ఎమ్మెల్యేలకు సౌకర్యవంతంగా ఉండడంతోపాటు, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని మంత్రి చెప్పారు. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో దాదాపుగా అన్ని చోట్లా నిర్మాణ పనులు పూర్తయ్యాయని, చాలా చోట్ల ఆఫీసులు అందుబాటులోకి వచ్చాయన్నారు.

హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో క్యాంపు ఆఫీసుల నిర్మాణానికి 500 చదరపు గజాల చొప్పున భూమి సేకరించాలని హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్డీవోలను ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ స్థలాలను పరిశీలించి, ఎమ్మెల్యేలతో చర్చించి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. సమావేశంలో మంత్రులు తలసాని, మహముద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ,   ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, సాయన్న, అహ్మద్ బిన్ బలాల, జాఫర్ హుస్సేన్, కౌసర్ మొయినుద్దీన్, సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్ అహ్మద్ ఖాన్ తో పాటు  హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్,  ఈఎన్ సీ  గణపతిరెడ్డి అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.