కేసీఆర్ పుట్టిందే రైతుల కోసం: మంత్రి వేముల‌

నిజామాబాద్:  నిజామాబాద్ జిల్లాలో కరోనా కట్టడిలోనే ఉందని అన్నారు మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి. ఇతర దేశాల నుండి వచ్చిన న‌లుగురు జిల్లా వాసులకు కరోనా పాజిటివ్ వచ్చిందని, వారంతా ప్రభుత్వ క్వారంటైన్ లోనే ఉన్నారన్నారు. ముంబై నుండి వచ్చిన ఇండల్వాయి మండలానికి చెందిన గంగాకిషన్ అనే వ్యక్తికి పాజిటివ్ రాగా అత‌డిని గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డం జరిగిందని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో కరోనా నిర్మూలనకు కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు, వైద్యఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు.

తెలంగాణ లో పండిన పంట‌కు మంచి మద్దతు ధర అందించేందుకు, లాభసాటి వ్యవసాయం చేసేందుకు సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని మంత్రి వేముల అన్నారు. ఈ ఏడాది జాప్యం లేకుండా 80 శాతం వ‌రి ధాన్యాన్ని కొనుగోలు చేశామ‌ని, ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యానికి గాను ప్ర‌భుత్వం రూ.500కోట్ల రైతులకు చెల్లించడం జరిగిందని చెప్పారు.

రాష్ట్రంలో పంట విస్తీర్ణం, దిగుబడులు పెంచేందుకు సీఎం కేసీఆర్ లాభసాటి వ్యవసాయం ప్రవేశ పెడుతున్నారని అన్నారు. ఏ కాలంలో ఏ పంటలు పండిస్తే లాభం వచ్చే విధానానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. తెలంగాణ రైతు లాభసాటి వ్యవసాయం, గిట్టుబాటు ధరలు పొందేందుకు కోసం కేసీఆర్ నడుం బిగించార‌ని, .డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే గిట్టుబాటు వస్తుందని చెప్పారు. రైతు నష్టపోవద్దనే ఉద్దేశ్యంతో సీఎం నూతన విధానంకు రూపకల్పన చేశార‌న్నారు. ప్ర‌తిప‌క్షాలు ఇది నియంతృత్వ వ్యవసాయం అనీ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని, కేసీఆర్ పుట్టిందే రైతుల కోసమ‌ని అన్నారు. రాబోయే రోజుల్లో పంటలు కొనలేని పరిస్థితి వస్తే తెలంగాణ లో రైతుకు నష్టం జరగక ఉండేందుకు ఈ కొత్త విధానం అమ‌లు చేస్తున్నార‌న్నారు. రైతులు, నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమీక్షలు జరిపి తెలంగాణ లాభసాటి వ్యవసాయ విధానం రూపొందిస్తున్నారని చెప్పారు

వరి, మొక్క జొన్న, పత్తి పంటల సాగు ఎలా ఉండాలనే విషయంలో సీఎం లెక్కలు వేశారని మంత్రి తెలిపారు. 70లక్షల ఎకరాల లోపు వరి పంట పండించాలని, పత్తిని 53లక్షల నుంచి 70లక్షలు పండించాలని చెప్పారు. మక్కలు 20లక్షల డిమాండ్ ఉంది కాబట్టి, 6లక్షల ఎకరాల్లో పండించాలన్నారు. పసుపు పంటలో అంతరపంటగా మక్క వేసుకోవచ్చని, వర్షాకాలంలో కాకుండా యాసంగిలొనే మక్కపంట వేయాలని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో మక్కకు బదులుగా సొయా, కందులు, కూరగాయల, పత్తి వేసుకోవాలని చెప్పారు ప్ర‌శాంత్ రెడ్డి.రైతులకు దీనిపై అవగాహన కల్పిస్తామ‌ని, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

కేసీఆర్ బతికున్నంత వరకు రైతు బంధు కార్యక్రమం కొనసాగుతుంద‌ని మంత్రి అన్నారు. కరోనా వల్ల పసుపు మార్కెట్ మూసివేసినందున సీఎం కేసీఆర్ ను కోరితే ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారని చెప్పారు. రెండు, మూడు రోజుల్లోనే నిజామాబాద్ మార్కెట్ ప్రారంభిస్తామ‌ని, రైతులు పసుపు అమ్మకాలు చేసుకోవచ్చని చెప్పారు.

minister vemula prashanth reddy press meet on kcr's new agricultural policy

Latest Updates