దళితబంధు కావాలని నన్నెవరూ అడగలె

దళితబంధు కావాలని నన్నెవరూ అడగలె
  • సోషల్​ మీడియాలో డిమాండ్లు వచ్చినయేమో
  • దళితబంధు లెక్క తమకూ స్కీమ్​ కావాలని బీసీలేం అడగట్లే
  • బీసీలంతా మాకే ఓట్లేస్తామంటున్నరు
  • హుజూరాబాద్​లో మా ప్రత్యర్థి బీజేపీనే
  • చిట్‌‌చాట్‌‌లో మంత్రి ప్రశాంత్‌‌ రెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు: దళితబంధు అమలు చేయాలని, అందుకోసం రాజీనామా చేయాలని తననెవరూ అడగలేదని మంత్రి ప్రశాంత్‌‌ రెడ్డి చెప్పారు. సోషల్‌‌ మీడియాలో డిమాండ్లేమైనా రావొచ్చేమో గాని నేరుగా తనను ఎవరూ అడగలేదన్నారు. అసెంబ్లీ లాంజ్‌‌లో శుక్రవారం మీడియాతో మంత్రి చిట్‌‌చాట్‌‌ చేశారు. దళితబంధు లాంటి స్కీమ్​తమకూ కావాలని హుజూరాబాద్​లో  బీసీలు అడగట్లేదా అని ప్రశ్నించగా.. అలాంటి డిమాండ్‌‌ ఏమీ రావట్లేదన్నారు. సర్వేల్లో తమకు 15 శాతం ఆధిక్యం వస్తుందని వెల్లడైందని.. అందరూ ఓట్లేస్తేనే ఆధిక్యం వస్తుంది కదా అని ఎదురు ప్రశ్నించారు. బీసీలంతా తమకే ఓట్లేస్తామంటున్నారని, బీసీలు, ఇతర వర్గాలు ఓట్లేస్తామంటే వద్దనాలా అన్నారు. దళితబంధు అమలు చేసిన తర్వాతే టీఆర్‌‌ఎస్‌‌కు హుజూరాబాద్​లో ఆధిక్యం పెరిగిందని, ఎన్నికల నాటికి ఆధిక్యం ఇంకా పెరుగుతుందని అన్నారు.

ఈటలను మేమేం బయటకు పంపలే

ఈటల రాజేందర్‌‌ను తాము బయటికి పంపలేదని, ఆయనే వెళ్లిపోయారని ప్రశాంత్​రెడ్డి చెప్పారు. కరోనా తీవ్రత ఎక్కువ ఉన్నందునే ఎన్నికలు వాయిదా వేయాలని గతంలో ప్రభుత్వం కోరిందన్నారు. ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గిందన్నారు. ‘ఎన్నికలు వాయిదా వేయాలని ఒక్క తెలంగాణనే కోరలేదు. చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు పెట్టట్లేదు. మమతా బెనర్జీ 6 నెలల్లో అసెంబ్లీకి ఎన్నిక కావాలి కాబట్టే అక్కడ ఉప ఎన్నిక పెట్టారు’ అన్నారు. హుజూరాబాద్‌‌లో టీఆర్‌‌ఎస్‌‌కు బీజేపీనే ప్రత్యర్థి అని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్​లో గ్రామ కమిటీలు కొన్నిచోట్ల మంచి ఫలితాలిస్తుంటే ఇంకొన్ని చోట్ల ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయన్నారు. రాజకీయాల్లో వాళ్ల జోక్యం తక్కువే ఉంటున్నా ఎన్నికలప్పుడు వాళ్ల దగ్గరికి వెళ్లక తప్పదన్నారు.