మంత్రులు మాట్లాడుకోలే.. సక్సెస్ కాని కేసీఆర్ ప్లాన్

పాలమూరు ప్రాజెక్టు టూర్లో ఎడమొహం పెడమొహం

హై దరాబాద్, వెలుగు: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మధ్య విభేదాలు పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ వేసిన ప్లాన్ వర్క్ అవుట్ కాలేదని పార్టీ లీడర్లు చెబుతున్నారు. ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించాలని ఆయన ఆదేశించారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రాజెక్టు దగ్గరికి వెళ్లిపనుల పురోగతిపై ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. ‘సీఎం చెప్పినందుకే టూర్ కు వచ్చారు తప్ప మంత్రులిద్దరూ మాట్లాడుకోలేదు. ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారు.’అని టూర్ కు వెళ్లిన ఓ లీడర్ వివరించారు. కొంతకాలంగా జిల్లాలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మధ్య ఆధిపత్య పోరునడుస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ ఎమ్మెల్యేలు మంత్రి నిరంజన్ రెడ్డిపక్షాన నిలిచారు. తనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను జత కట్టాడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. టైం కోసం ఎదురు చూసి కేటీఆర్ టూర్ సమయంలో మంత్రి నిరంజన్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలపై శ్రీనివాస్ గౌడ్ కసి తీర్చుకున్నాడని పార్టీ లీడర్లు చెప్తున్నారు.

కేటీఆర్ టూర్ లో బయటపడ్డ విభేదాలు
జులై 13న మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ లో పర్యటించారు. ఆ టైంలో జిల్లాలోని ఆధిపత్య పోరు బయటపడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జిల్లాకు వచ్చిన సందర్బంగా జిల్లాలోని మరో మంత్రి నిరంజన్ రెడ్డి, మిగతా ఎమ్మెల్యేలను ప్రోగ్రాంకు ఆహ్వానిస్తారని అందరూ భావించారు.
కాని శ్రీనివాస్ గౌడ్ మాత్రం ఎవ్వరికీ ఇన్విటేషన్ ఇవ్వలేదు. కేవలం లోకల్ లీడర్ల సమక్షంలోనే కేటీఆర్ తో మహబూబ్ నగర్ టీచింగ్ హాస్పిటల్, కేసీఆర్ పార్కు, కేటీఆర్ కాలనీ ప్రారంభించారు. ఆ తర్వాత జిల్లా లీడర్లతో పాటు ఎమ్మెల్యేలు లంచ్ సమయంలో కేటీఆర్ ను కలిశారు. శ్రీనివాస్ గౌడ్ తీరుపై ఆగ్రహంగా ఉన్న జిల్లాకు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రి తమను అవమానపరచారని కేసీఆర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. విషయాన్ని కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే ఓ నేతకు వివరించారు. దీంతో సీఎం ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలను పోగొట్టేందుకు రెండు రోజుల క్రితం ఇరిగేషన్ పై జరిగిన రివ్యూ టైంలో అందరూ కలిసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పరిశీలించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు శుక్రవారం మంత్రులు వెళ్లారే తప్ప విభేదాలు అలాగే ఉన్నాయనే చర్చ పార్టీలో జరుగుతోంది.

పనుల్లో వేగం పెంచండి
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులను వేగిరం చేయాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నార్లాపూర్ రిజర్వాయర్లో పూర్తి కెపాసిటీ మేరకు నీరు ఉండేలా నిర్మించాలని సూచించారు. శుక్రవారం మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాసగౌడ్, ఎంపీ, ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ఏదుల రిజర్వాయర్ వద్ద ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో ప్యాకేజీ వారీగా మంత్రులు సమీక్షించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని మొదటి రిజర్వాయర్ నార్లాపూర్లో సాధ్యమైనంత ఎక్కువ నీరు నిల్వ ఉంచేలా నిర్మించాలని సాగునీటి అధికారులను మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. భవిష్యత్తులో పాలమూరు ద్వారానే ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు తాగునీరు అందించేలా చూడాలన్నారు. ఏకకాలంలో టన్నెల్, కాలువల పనులు చేపట్టి పనుల పురోగతిని వాట్సాప్ ద్వారా ఉమ్మడి పాలమూరు ప్రజాప్రతినిధులకు తెలపాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ విప్లు అచ్చంపేట
ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములు, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీచైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్, డా. లక్ష్మా రెడ్డి, డాక్టర్ అబ్రహం, రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

For More News..

‘సింగరేణి’లో కరోనాతో చనిపోతే రూ.15లక్షల పరిహారం

అయోధ్య భూమి పూజకు 1,11,000 లడ్డూలు

అమెరికా జీపీఎస్‌‌‌‌‌‌‌‌కు డ్రాగన్ కంట్రీ సవాల్

సమస్యను కేటీఆర్ కు ట్వీట్ చేస్తే కేసులా!

Latest Updates