‘క్రైస్తవులు ఈ సమాజానికి మంచి విద్య, వైద్యాన్ని అందిస్తున్నారు’

సమాజం కష్టాల్లో ఉన్నప్పుడు మొదట స్పందించేది క్రైస్తవ సమాజమేన‌ని అన్నారు రాష్ట్ర‌ ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్. క్రైస్తవులు ఈ సమాజానికి మంచి విద్య, వైద్యాన్ని అందిస్తున్నారన్నారు. న‌గ‌రంలోని బంజారాహిల్స్‌లో బిష‌ప్‌లు, క్రైస్త‌వ ప్ర‌ముఖుల‌తో ఏర్పాటు చేసిన ఆత్మీయ స‌మ్మేళ‌నంలో మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వ‌ర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ వినోద్ కుమార్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ,ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు ,సికింద్రాబాద్ బిషప్ తుమ్మ బాల పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. క్రైస్త‌వ మిష‌న‌రీలు కొన్ని ద‌శాబ్దాలుగా విద్య‌, వైద్య రంగంలో ఎన‌లేని కృషి చేస్తున్నార‌ని కొనియాడారు. తాను కరీంనగర్ మిషనరీ ఆసుపత్రిలో జన్మించానని చెప్పిన మంత్రి.. తాను, త‌న‌ సోదరీ సైతం మిషనరీ పాఠశాలలోనే చదువుకున్నామ‌ని తెలిపారు. ఎక్క‌డ విప‌త్తులు సంభవించినా సేవ‌లు అందించ‌డానికి క్రైస్త‌వ స‌మాజం ముందు ఉంటుంద‌న్నారు. విప‌త్తుల వేళ కూడా విశేష సేవా, స‌హాయం అందిస్తున్నాయ‌ని మంత్రి పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ కు హిందు ధర్మాన్ని ఆచరించటంతో పాటు ఇతర ధర్మాల పట్ల కూడా అంతే గౌరవముందని అన్నారు. అన్ని వ‌ర్గాల సంక్షేమ‌మే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. అందర్నీ కలుపుకుని వెళ్ళే సమర్థవంతమైన నాయకత్వం కేసీఆర్ సొంతమ‌ని చెప్పారు . సచివాలయంలో మంచి చర్చిని నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పంతో ఉన్నారన్నారు. యాదాద్రి లాంటి పుణ్యక్షేత్రాన్ని .. త్వ‌ర‌లోనే క్రైస్తవులకు సైతం నిర్మిస్తామ‌న్నారు కేటీఆర్. క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి అడ్వైజరీ కమిటీని నియమిస్తామ‌న్నారు. కోకాపేటలో క్రైస్తవ భవనం పనులను 15రోజుల్లో ప్రారంభిస్తామ‌ని, 63ఎకారాల్లో క్రైస్తవ శ్మశాన వాటికను అభివృద్ధి చేసి ఇస్తామ‌ని చెప్పారు

సీఎం కెసిఆర్ నాయకత్వం లోని తెలంగాణ లో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు వినోద్ కుమార్ . పట్టణం ,పల్లె అనే తేడా లేకుండా అంతటా అభివృద్ధి కనిపిస్తోందన్నారు. క్రిస్టియన్ల సమస్యల పరిష్కారం పై సీఎం కెసిఆర్ చిత్తశుద్ధి తో ఉన్నారన్నారు.

క్రిస్ట్‌మస్ ను రాష్ట్ర పండగగా గుర్తించిన సీఎం ఒక్క కేసీఆరే న‌ని ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు అన్నారు. గ్రామాల్లో చర్చిల నిర్మాణానికి పంచాయతీ అనుమతి సరిపోతుందని ప్రభుత్వం జీవో ఇవ్వడం సంతోషమ‌ని చెప్పారు. స్మశాన వాటికలకు స్థలం కూడా ఉదారం గా కేటాయిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనిని అన్నారు.

Latest Updates