లాక్డౌన్ ఉండదంటూ మంత్రుల లీకులు

కరోనా సమస్యకు అదే పరిష్కారం కాదని వ్యాఖ్యలు
గ్రేటర్ హైదరాబాద్లో మళ్లీ లాక్ డౌన్ విధింపుపై జూన్ 28న కేసీఆర్ కామెంట్స్
ఆందోళనకు గురైన ప్రజలు.. లక్షలాది మంది సొంతూళ్లకు..
సిటీలో చాలా షాపులు క్లోజ్.. వ్యాపారుల సెల్ఫ్ లాక్డౌన్
ఆదాయానికి గండి పడిందని గుర్తించిన సర్కారు
ఇప్పుడు లాక్డౌన్ అవసరంలేదంటూ క్లారిటీ ఇస్తున్న మంత్రులు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మళ్లీలాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని మంత్రులు చెబుతున్నారు. బుధవారం కరీంనగర్ పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, గ్రేటర్ లో మళ్లీలాక్ డౌన్ లేదని స్పష్టంచేశారు. ‘‘వ్యాక్సిన్ వచ్చేంత వరకు వైరస్ తో సహజీవనం చేయాలి. లైఫ్ అండ్ లైవ్లీ ముఖ్యం’’ అని అన్నారు. ‘‘మళ్లీలాక్ డౌన్ విధిస్తే లాభం లేదు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. హోం మంత్రి, డిప్యూటీ స్పీకర్, వీహెచ్ లాంటి పెద్దోళ్లు వైరస్ తో పోరాడి గెలిచారు’’ అని గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మళ్లీ లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిశీలిస్తామని గత నెల 28న సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. సిటీలో చాలా మంది గ్రామాలకు వెళ్లిపోయారు. షాపుల యజమానులు సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు. ఆదాయానికి గండి పడిందని విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఇప్పుడు లాక్ డౌన్ ఉండదంటూ మంత్రులతో చెప్పిస్తున్నారని ఓ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.

సీఎం తొందరపాటు ప్రకటన?
కరోనా కట్టడి కోసం మళ్లీలాక్ డౌన్ విధించే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన వల్ల పార్టీ పరువుపోయిందనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. సీఎం స్థాయి వ్యక్తి తొందరపాటుగా మాట్లాడారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని అనుకుంటున్నారు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించే కేసీఆర్.. లాక్ డౌన్ ఉంటుందని చెప్పడం వెనుక కూడా ఏదో రాజకీయ వ్యూహం ఉండొచ్చని కొందరు నేతలు మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సెంట్రల్ టీం దృష్టి మరల్చేందుకే లాక్ డౌన్ అంశం తెరమీదికి తెచ్చారని ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అన్నారు.

ఒక్కో మంత్రి ఒక్కోలా..
లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి ఒక్కో మంత్రి ఒక్కో తీరుగా మాట్లాడారు. ‘‘కరోనా కట్టడికి లాక్ డౌన్ పరిష్కారం కాదు. అవసరం ఉంటేనే బయటికి రావాలి’’ అని మంత్రి తలసాని అన్నారు. మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ లో ఉండటం సేఫ్‌‌ కాదన్నారు. ‘‘హైదరాబాద్ నుండి ప్రజలు సొంత ఊళ్లకు వెళ్తున్నారు. అంటే ప్రభుత్వం మీద నమ్మకం లేక కాదు. ఇరుకు గదుల్లో ఉండే కన్నా ఊళ్లో ప్రశాంతంగా ఉండచ్చని. ఈ సమయంలో హైదరాబాద్ కంటే ఊరిలో ఉంటేనే బెట్టర్’’ అని చెప్పారు. ‘‘లాక్ డౌన్ విధిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ. కరోనా సమస్యకు లాక్ డౌన్ పరిష్కారం కాదు’’ అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. దీంతో సిటీలో ఏదో జరుగుతోందనే గందరగోళం జనంలో మొదలైంది. వేలాది మంది పట్నం విడిచి పల్లెకు తరలి వెళ్లిపోయారు.

For More News..

ప్రభుత్వంలో 10 వేల మంది ఉద్యోగాలు ఊస్ట్

సెక్రటేరియట్ శిథిలాల ట్రాన్స్ పోర్టుకే రూ. 15 కోట్లు!

12 హాస్పిటళ్లు తిరిగినా పట్టించుకోలే.. ఊరికి వాపస్ వెళ్తూ యాక్సిడెంట్లో మృతి

Latest Updates