మంత్రులు, ఎమ్మెల్యేలు.. పైసా వసూల్

టికెట్లు, మేయర్, చైర్మన్ పోస్టులను
అమ్ముకున్నట్టు కొందరిపై ఆరోపణలు
రాష్ట్రవ్యాప్తంగా కీలక కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో దందా

హైదరాబాద్​ శివార్లలో మరింత గట్టిగా వసూళ్లు
ఓ మంత్రి 50 కోట్లకుపైగా వెనకేసుకున్నట్టు హైకమాండ్​కు ఫిర్యాదులు

‘ఇక్కడ నేనే సీఎం.. ఇష్టమున్న చోట చెప్పుకో’ అంటున్న ఆడియో టేపు లీక్​
దక్షిణ తెలంగాణలో ఓ మంత్రి, ఉత్తర తెలంగాణలో మరో మంత్రి..
పలు జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలదీ ఇదే తీరు.. నజర్​ పెట్టిన హైకమాండ్

హైదరాబాద్, వెలుగుమున్సిపోల్స్  టికెట్ల పంపిణీలో కొందరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేతివాటం చూపించారు. సొంత పార్టీ క్యాండిడేట్ల దగ్గరే గట్టిగా వసూళ్లకు దిగారు. కౌన్సిలర్​ టికెట్​కు ఇంత అని.. చైర్మన్​ పోస్టుకు అంత అని.. ప్లేసును బట్టి, పోస్టును బట్టి ఐదారు లక్షల నుంచి పది కోట్ల దాకా దండుకున్నారని పార్టీ పెద్దలకు ఫిర్యాదులు అందాయి. ఒకట్రెండు చోట్ల భూములు, ఆస్తుల రూపంలోనూ వసూలు చేశారని.. అడిగినవి అందాకే పార్టీ బీఫారాలు ఇచ్చారని సమాచారం. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా డబ్బులు తీసుకుంటే.. మరికొందరు తమ బంధువులు, సన్నిహితులకు వసూళ్ల పని అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

ముఖ్యంగా  హైదరాబాద్ శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పలు కీలక ప్రాంతాల్లో ఈ దందా ఎక్కువగా జరిగిందని అంటున్నాయి. మేయర్ పదవి కోసం రూ. ఏడు కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకోగా.. చైర్మన్ పదవికి రూ.4 కోట్ల దాకా వసూలు చేసినట్టు చెప్తున్నాయి. కొత్త జిల్లా కేంద్రాల్లోని మున్సిపాలిటీ టికెట్లనూ అమ్ముకున్నారని, చైర్మన్ పదవికి రెండు, మూడు కోట్ల వరకు తీసుకున్నారని అంటున్నాయి. టికెట్ల దందాపై నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు ప్రగతిభవన్ కు రిపోర్టు ఇచ్చాయని పేర్కొంటున్నాయి. ఈ బాగోతం ప్రస్తుతం టీఆర్ఎస్​వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పార్టీ ఫండ్​ లేదు.. పైగా గెలుపు బాధ్యత

ప్రస్తుతం మున్సిపల్​ ఎలక్షన్ల కోసం పార్టీ నుంచి ఎలాంటి ఫండింగ్​ లేదని టీఆర్ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్ల వరకు క్యాండిడేట్లు ఎవరైనా సొంతంగానే ఖర్చు పెట్టుకోవాలని స్పష్టం చేసినట్టు పేర్కొంటున్నాయి. అయితే పార్టీ నుంచి ఫండ్​ ఏమీ రాకున్నా.. హైకమాండ్​ మున్సిపోల్స్​లో గెలుపు బాధ్యతలను పూర్తిగా ఎమ్మెల్యేలు, మంత్రులకు అప్పగించింది. ఎక్కడైనా ఓటమి ఎదురైతే సదరు సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు, మంత్రులపై ఎఫెక్ట్​ ఉంటుందని, పదవులు ఊడుతాయని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు వీలైనంత వరకు భారీగా ఖర్చు పెట్టగల అభ్యర్థులనే ఎంపిక చేశారు. అయితే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుచరులకు టికెట్లు ఇచ్చుకోవడం, వారి తరఫున ఖర్చు, తామూ విస్తృతంగా ప్రచారం చేయాల్సి రావడం, పనిలోపనిగా ఇంత వెనకేసుకోవాలన్న ఉద్దేశంతో ‘వసూళ్ల’కు దిగారు. మేయర్, చైర్మన్​ పదవుల కోసం రేట్లు ఫిక్స్​ చేసి దండుకున్నారు.

అసెంబ్లీ, లోక్​సభ ఖర్చులు రాబట్టుకునేందుకు?

ఎలక్షన్లు జరిగి ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది పూర్తయింది. నియోజకవర్గాల అభివృద్ధి కింద ఇప్పటిదాకా నిధుల్లేవు. కొత్తగా పథకాలేం మొదలుపెట్టలేదు. మధ్యలో ఎంపీ ఎలక్షన్లు, పరిషత్​ ఎలక్షన్లతో ఖర్చు చేయాల్సి వచ్చింది. దానికితోడు ఎమ్మెల్యేలు బయటికి కాలు పెడితే రోజూ పది వేలదాకా ఖర్చవుతోందని ఎమ్మెల్యేల సన్నిహితులు చెప్తున్నారు. దీంతో ఆ ఖర్చులను రాబట్టుకునేందుకు బాగా డిమాండ్​ ఉన్న మున్సిపోల్స్​ను వాడుకుంటున్నరని పార్టీ వర్గాలు అంటున్నాయి. ‘‘మున్సిపల్  ఎలక్షన్లు కొందరు ఎమ్మెల్యేలకు వర్కవుట్ అయినయి. కొంత ఆదాయం తెచ్చిపెట్టినయి. బాగా డబ్బున్నోళ్లే పోటీ చేస్తున్నారు. వాళ్ల దగ్గర తీసుకుంటే తప్పు కాదులే..’’ అని కామెంట్​ చేస్తున్నాయి.

టికెట్ల ‘బాధ్యత’ను క్యాష్​ చేసుకున్నరు

గ్రేటర్  హైదరాబాద్ చుట్టూ కొత్తగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు,10 మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. ఇక్కడ మేయర్, చైర్మన్  పదవుల కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. దీనికితోడు క్యాండిడేట్ల ఎంపిక బాధ్యతను పార్టీ హైకమాండ్​ పూర్తిగా స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించడాన్ని గ్రేటర్​ శివార్లకు చెందిన ఓ మంత్రి క్యాష్​ చేసుకున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తన సెగ్మెంట్​ పరిధిలోని కార్పొరేషన్, మున్సిపల్​ టికెట్లను అమ్ముకున్నారని.. మేయర్  పోస్టుకు పది కోట్లు, చైర్మన్ పదవి కోసం రూ. 5 కోట్ల వరకు వసూలు చేశారని సమాచారం. మొత్తంగా రూ.50 కోట్ల వరకు దండుకున్నారని, ఈ విషయం పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ వరకు వెళ్లిందని పార్టీ నేతలు చెప్తున్నారు. ‘‘ఆ మంత్రి కదలికలపై నిఘా ఉంది. బీ ఫారాలు ఇచ్చే సమయంలో డబ్బు కోసం ఆ మంత్రి మాట్లాడిన మాటలన్నీ కొందరు రికార్డు చేశారు. కొందరి వద్ద స్వయంగా మంత్రే నేరుగా డబ్బు తీసుకున్నారు. టికెట్ కోసం కొందరు భూములు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు’’ అని సీనియర్​ లీడర్​ ఒకరు వెల్లడించారు.

రెబల్స్​గా నామినేషన్లు వేయించి..

కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు దండుకోడానికి కొత్త వ్యూహాన్ని అమలు చేశారు. తాము కోరుకున్నట్టుగా కాకుండా ప్రత్యర్థివర్గానికి అనుకూలంగా రిజర్వేషన్  వచ్చిన చోట రెబల్స్​ను రంగంలోకి దింపారు. పార్టీ క్యాండిడేట్​కు పోటీగా తమవారితో నామినేషన్లు వేయించారు. వారు పోటీ నుంచి తప్పుకొనేందుకు డబ్బు డిమాండ్​ చేస్తున్నారని చెప్పి.. చైర్మన్​ ఆశావహుల నుంచి రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఇది ఎక్కువగా జరిగిందని తెలిసింది.

చైర్మన్  పదవి కోసం రూ.2 కోట్లు

మహబూబాబాద్ జిల్లాలోని ఓ మున్సిపాలిటీ చైర్మన్ పదవి కోసం ఓ ఎమ్మెల్యే రూ. రెండు కోట్లు వసూలు చేశారని తెలిసింది. చైర్మన్ పదవి ఆశిస్తున్న నేత నుంచి దశలవారీగా ఆ మొత్తాన్ని తీసుకున్నట్టు సమాచారం. కానీ ఇప్పుడా నేతకు ఓడిపోయే వార్డు కేటాయించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదే మున్సిపాలిటీలో కౌన్సిలర్ టికెట్ కోసం సదరు ఎమ్మెల్యే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది.

ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ..

యాదాద్రి సమీపంలోని ఓ మున్సిపాలిటీలో మెజార్టీ వార్డుల బీఫారాలు స్థానిక ఎమ్మెల్యే అమ్ముకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. టికెట్ అమ్ముకున్నారంటూ కొందరు ఆశావాహులు ఆ ఎమ్మెల్యే ఇంటి ముందు ఆందోళన కూడా చేశారని.. ఈ అంశంపై సదరు ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ కు వివరణ కూడా ఇచ్చుకున్నారని తెలిసింది. మహబూబ్ నగర్ లోని ఓ ఎమ్మెల్యే అక్కడి మున్సిపల్​ చైర్మన్ పదవి కోసం రూ.10 లక్షలు వసూలు చేశారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఓ ఎమ్మెల్యే కూడా చైర్మన్ పదవుల కోసం రూ.50 లక్షల వరకు వసూలు చేశారని తెలిసింది.

Latest Updates