సెక్రటేరియెట్ కు మంత్రులు షిఫ్టయితలేరు

  •              సెక్రటేరియెట్ షిప్టింగ్ పూర్తవుతున్నా స్టార్ట్ కాని పేషీలు
  •                 రెండేళ్లపాటు అక్కడ ఉండలేమని సన్నిహితులతో కామెంట్స్

సెక్రటేరియెట్ షిఫ్టింగ్ చివరి దశకు చేరుకుంది. కానీ మంత్రుల చాంబర్ల షిఫ్టింగ్ మాత్రం ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. అసలు మినిస్టర్ల చాంబర్లు ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న దానిపై కూడా స్పష్టత రావటం లేదు. బీఆర్కే భవన్​లో ఉండేందుకు వారు ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. ఏడాది నుంచి రెండేళ్ల పాటు అక్కడ ఉండలేమని మంత్రులు తమ సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం.

తగ్గిన మంత్రుల హాజరు

సెక్రటేరియెట్ లోని మంత్రుల చాంబర్లు ఉన్న డీ బ్లాక్ నిర్మానుష్యంగా మారింది. అన్ని ఫ్లోర్లు ఫర్నిచర్ , చెత్తతో దర్శనమిస్తున్నాయి. దీంతో సెక్రటేరియెట్ కు వస్తున్న మంత్రుల హాజరు తగ్గింది. మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి మాత్రమే రెగ్యులర్ గా వస్తున్నారు. ఇతర మంత్రులు జిల్లా పర్యటనల్లో ఉన్నారు. సుమారు 10 రోజులు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. ఆ తర్వాతే సెక్రటేరియెట్ కూల్చివేతపై ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. కూల్చివేత వరకు పాత సెక్రటేరియెట్ లోనే ఉండాలని మంత్రులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల గందరగోళం

మంత్రులు, ఉన్నతాధికారులను కలిసేందుకు వచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గందరగోళానికి గురవుతున్నారు. పాత సెక్రటేరియెట్ కు ఇప్పటికీ ఎమ్మెల్యేలు వస్తూనే ఉన్నారు. మంత్రులు ఉంటే కలుస్తున్నారు. ఉన్నతాధికారులు ఎక్కువ శాతం బీఆర్కే భవన్ లో, కొంత మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని, కలవటం లేదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. మరోవైపు షిఫ్టింగ్​తో ఏ ఫైల్ ఎక్కడుందో తెలియక ఉద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు.

ఒక ఫ్లోర్.. 9 చాంబర్లు

సెక్రటేరియెట్ లోని శాఖలన్నింటిని బీఆర్కే భవన్ కు (తాత్కాలిక సెక్రటేరియెట్ ) షిఫ్ట్ చేస్తున్నారు. అదే బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ ను పూర్తిగా 9 మంది మంత్రుల చాంబర్లకు కేటాయించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. అబిడ్స్ లోని ఆ శాఖ కమిషనరేట్ కు షిఫ్ట్ అయ్యారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. ఎర్రమంజిల్ లోని ఆ శాఖ ఈఎన్సీ కార్యాలయానికి మారారు. మరోవైపు ఈనెల 15 కల్లా షిఫ్టింగ్ పూర్తయ్యే అవకాశాలున్నాయి. కానీ మంత్రులకు కేటాయించిన ఫస్ట్ ఫ్లోర్ లో మాత్రం ఇంత వరకు ఎలాంటి రెనోవేషన్ స్టార్ట్ కాలేదు. ఒక్క ఫ్లోర్ లో 9 మంది మంత్రులకు చాంబర్లు కేటాయించటం, వాస్తు మార్పులు చేసుకునేందుకు అవకాశం లేకపోవటం, చిన్న చిన్న గదులు, వెంటిలేషన్, ట్రాఫిక్, పొల్యూషన్ వంటి సమస్యల వల్ల బీఆర్కే లో ఉండటానికి మంత్రులు ఆసక్తి చూపటం లేదని సమాచారం.

Latest Updates