ధోనీని చాలా మిస్సవుతున్నాం: మహ్మద్ షమి

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని తనతోపాటు టీమ్ మేట్స్ అందరూ తీవ్రంగా మిస్ అవుతున్నామని స్టార్ పేసర్ మహ్మద్ షమి అన్నాడు. ధోని తిరిగొస్తాడని, వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్ తో మళ్లీ ఆడటం సరదాగా ఉంటుందన్నాడు. ఫీల్డ్ లోపల, వెలుపలా ధోని నిజమైన వ్యక్తి అని, అతడు టీమ్ లో లేకపోవడంతో రాత్రి పూట ముచ్చట్లు, డిన్నర్స్ మిస్సవుతున్నానని చెప్పాడు.

‘ఐపీఎల్ ను మినహాయించి అన్ని ఫార్మాట్లలోనూ ధోని సారథ్యంలో ఆడా. అతడు తన సహచరులను ట్రీట్ చేసే విధానం చూస్తే తామున్నది ఎంఎస్ ధోనీతోనా అనేలా ఉంటుంది. అతడు నిజంగా పెద్ద ప్లేయర్. ధోనికి సంబంధించిన చాలా జ్ఞాపకాలు నాకున్నాయి. ఇప్పుడు కూడా తను మళ్లీ టీమ్ లోకి వస్తాడని అనుకుంటున్నాం. ధోని భాయ్ తో ఆడటం సరదాగా ఉంటుంది. మహీలో నాకు ఎక్కువగా నచ్చే విషయం ఏంటంటే.. అతడు అందరితో కలసి డిన్నర్ చేయడానికి ఇష్టపడతాడు. అతడితో ఎప్పుడూ ఇద్దరు నుంచి నలుగురు కూర్చుని ఉంటారు. మేం రాత్రి పొద్దు పోయేదాకా మాట్లాడుకుంటూ ఉంటాం. వీటిని చాలా మిస్సవుతున్నాం. అతడు ఐపీఎల్ లో 100 శాతం ఆడాలని అనుకుంటున్నాడు. కానీ ధోని భాయ్ ఇండియాకు ఆడాలనుకుంటున్నాడా లేదా అనేది తెలుసుకోవాలి. నాకు తెలిసి అతడు ఇండియాకు మళ్లీ ఆడడు అని నేను భావిస్తున్నా’ అని షమి పేర్కొన్నాడు.

Latest Updates