ఉక్రెయిన్ విమానంపై మిసైల్ దాడి?..అనుమానం ఉందన్న ఆ దేశ అధికారులు

టెహ్రాన్: బోయింగ్ 737–800 విమాన ప్రమాదం.. మిసైల్, లేదా డ్రోన్ దాడి వల్ల జరిగి ఉండొచ్చని భావిస్తున్నామని ఉక్రెయిన్ కామెంట్ చేసింది. ‘‘టోర్ మిసైల్ సిస్టమ్ (రష్యా తయారు చేసినది) ద్వారా మిసైల్ దాడి జరిగి ఉండొచ్చని మేం ఎక్కువగా భావిస్తున్నాం. ప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గర్లో మిసైల్ ఆనవాళ్లు ఉన్నట్లుగా ఇంటర్నెట్​లో సమాచారం కనిపించింది” అని ఉక్రెయిన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటరీ ఒలెస్కీ దానిలోవ్ చెప్పారు. అయితే ఇంటర్నెట్​లో ఏ వెబ్​సైట్​లో కనిపించిందనే విషయాన్ని చెప్పలేదు. ప్రమాదం వెనుక టెర్రరిజం కారణాలు కూడా ఉండొచ్చని, డ్రోన్ దాడి కూడా జరిగి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలను ఇరాన్ అధికారులు ఖండించారు. ఇరాన్ వ్యతిరేక విదేశీ శక్తులు మానసిక యుద్ధానికి తెర తీస్తున్నాయని ఇరాన్ ఆర్మ్​డ్ ఫోర్సెస్ స్పోక్స్ పర్సన్ జనరల్ అబోల్​ఫజల్ షెకార్చీ ఆరోపించారు. అంతకుముందు బోయింగ్ విమానం మెకానికల్ ట్రబుల్ వల్లే కూలిపోయిందన్న ఇరాన్ అనుమానాలను మొదట అంగీకరించిన ఉక్రెయిన్ అధికారులు.. తర్వాత మాట మార్చారు. ఘటనకు కారణాన్ని చెప్పేందుకు నిరాకరించారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని, ఈ సమయంలో ఊహాగానాలను వ్యక్తం చేయలేమని అన్నారు. బుధవారం తెల్లవారుజామున టెహ్రాన్​లోని ఇమామ్ ఖొమేనీ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టు నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్​కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే కూలిపోయింది. 176 మంది చనిపోయిన ఈ విమాన ప్రమాదానికి కచ్చితమైన కారణం ఏంటనేది ప్రస్తుతానికి తెలియరాలేదు.

వెనక్కి రావాలని  ప్రయత్నించింది..: ప్రైమరీ రిపోర్టు

‘‘ఉక్రెయిన్ ఎయిర్​లైన్స్​కు చెందిన బోయింగ్ 737–800 విమానం.. మంటలు అంటుకున్న వెంటనే వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించింది. కానీ పైలెట్లు నియంత్రించలేకపోయారు. ఆ సమయంలో తమకు సహాయం కావాలని సిబ్బంది నుంచి మాకు ఎలాంటి రేడియో కాల్ రాలేదు” అని ఇరాన్ ప్రాథమిక రిపోర్టు చెప్పింది. విమానంలో అకస్మాత్తుగా అత్యవసర పరిస్థితి తలెత్తిందని తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన ఇరాన్ ఏవియేషన్ అథారిటీ.. గురువారం ప్రాథమిక రిపోర్టును రిలీజ్ చేసింది. విమానం భూమిని ఢీకొనడానికి ముందే మంటల్లో చిక్కుకుందని ప్రత్యక్ష సాక్షులు, మరో విమాన సిబ్బంది చెప్పారని తెలిపింది. విమానంలో ఇంధనాన్ని పూర్తిగా నింపి ఉండటం వల్లే భారీ పేలుడు సంభవించిందని చెప్పింది. బ్లాక్​బాక్సు డ్యామేజీ అయిందని, కొంత మెమొరీని కోల్పోయిందని తెలిపింది. లేజర్ లేదా ఎలక్ర్టోమాగ్నటిక్ ఇంటర్ ​ఫియరెన్స్​వల్లే ప్రమాదం జరిగిందన్న కామెంట్స్​ను ఇన్వెస్టిగేటర్లు
కొట్టిపారేశారు.

స్టూడెంట్లే ఎక్కువ

చనిపోయిన వారిలో విద్యార్థులే ఎక్కువ. కెనడాలోని వర్సిటీల్లో చదువుకుంటున్నారు. వింటర్ సెలవుల తర్వాత కీవ్ మీదుగా టొరంటోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికుల్లో 138 మంది కెనడాకు వస్తున్నారని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. మృతుల్లో ఒకే కుటుంబానిక చెందిన నలుగురు, కొత్తగా పెళ్లి అయిన జంట కూడా ఉందన్నారు.

Latest Updates