బ్లాక్ ఫంగస్ కు కారణం స్టెరాయిడ్స్

బ్లాక్ ఫంగస్ కు కారణం స్టెరాయిడ్స్

సెకండ్ వేవ్ లో కరోనా బారినపడుతున్న వారిలో కొందరు కంటిచూపు కోల్పోతున్న కేసులు బయటపడుతున్నాయి. అందుకు కారణం బ్లాక్ ఫంగస్ అని గుర్తించారు. ఈ బ్లాక్ ఫంగస్ తో కొన్ని సందర్భాల్లో చనిపోవడం కూడా జరుగుతోంది. మ్యూకోర్ మైకాసిస్ అని పిలిచే ఈ బ్లాక్ ఫంగస్ పై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. ఇది ముఖ భాగాలకు ప్రధానంగా సోకుతుందని.. ముక్కు, కంటి వలయం, మెదడు వంటి భాగాలను ఇన్ఫెక్షన్ కు గురవుతున్నాయని తెలిపారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తులకు కూడా వ్యాపిస్తుందన్నారు. 

కరోనా పేషెంట్లలో బ్లాక్ ఫంగస్ తీవ్రం కావడానికి ప్రధాన కారణం విచ్చలవిడిగా స్టెరాయిడ్లు వాడడమేనని తెలిపారు రణదీప్ గులేరియా. అవసరంలేకున్నా స్టెరాయిడ్లు ఉపయోగిస్తుండటం.. బ్లాక్ ఫంగస్ ఉద్ధృతికి కారణమవుతోందన్నారు. మధుమేహంతో బాధపడుతున్నవారిలో, కరోనా పాజిటివ్ వ్యక్తుల్లో ఈ ఫంగస్ తీవ్ర లక్షణాలు కలుగజేస్తోందని తెలిపారు. దీన్ని నివారించాలంటే చికిత్సలో స్టెరాయిడ్ల దుర్వినియోగాన్ని నిలిపివేయాలన్నారు డాక్టర్ గులేరియా.