రిటైరయ్యేలోపు వరల్డ్ కప్ కొట్టాలి

న్యూఢిల్లీసుదీర్ఘ కెరీర్‌‌లో ఎన్నో ఘనతలు సాధించిన లెజెండరీ క్రికెటర్‌‌ మిథాలీ రాజ్‌‌ ఇండియాకు వరల్డ్‌‌ కప్‌‌ అందించలేకపోయింది. 2005, 2017 వన్డే  ప్రపంచకప్స్‌‌లో మిథాలీ టీమిండియాను ఫైనల్‌‌ చేర్చడంలో కృషి చేసింది. కానీ, రెండు సందర్భాల్లోనూ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌ చేతిలో అమ్మాయిల జట్టుకు షాక్‌‌ తగిలింది. అయితే, క్రికెట్‌‌కు రిటైర్మెంట్‌‌ ప్రకటించేలోపు వరల్డ్‌‌కప్‌‌ను తన ఖాతాలో వేసుకోవాలని ఆశిస్తున్నట్టు మిథాలీ చెప్పింది. ఇటీవల టాప్ జట్లపై నిలకడగా విజయాలు సాధిస్తుండడంతో  టీమిండియా ఖ్యాతి పెరిగిందన్నది. ఇతర జట్లు ఇకపై ఇండియాను తేలిగ్గా తీసుకోవని చెప్పింది. ‘వరల్డ్‌‌లో బెస్ట్‌‌ జట్లను మేం ఓడిస్తున్నాం. వన్డేల్లో ఆస్ట్రేలియాపై, టీ20ల్లో ఇంగ్లండ్‌‌పై విజయాలు మాలో కాన్ఫిడెన్స్‌‌ పెంచాయి. మమ్మల్ని కూడా ఓడించడం అంత తేలిక కాదని అందరికీ అర్థమైంది. ఇతర జట్లు ఇకపై మమ్మల్ని తేలిగ్గా తీసుకోవు.  బాగా ప్రిపేర్‌‌ అయి పోటీకి వస్తాయి’ అని మిథాలీ అభిప్రాయపడింది. వన్డేలపై దృష్టి పెట్టడం కోసం గతేడాది టీ20లకు గుడ్‌‌బై చెప్పిన మిథాలీ.. కరోనా టైమ్‌‌లో ఫిట్‌‌గా ఉండేందుకు తనను తాను ఎలా మోటివేట్‌‌ చేసుకుంటున్నానో తెలిపింది. ‘నా ఏజ్‌‌లో ఫిట్‌‌నెస్‌‌పై దృష్టిపెట్టడం చాలా ముఖ్యం. నా స్కిల్స్‌‌ను మర్చిపోనని నాకు తెలుసు. నాలో ఇంకొంత బ్యాటింగ్‌‌ మిగిలుంది. కొన్ని సెషన్లు ప్రాక్టీస్‌‌ చేస్తే నా రిథమ్‌‌ను తిరిగి అందుకుంటా.

ఈ టైమ్‌‌లో బయట రన్నింగ్ చేసేందుకు కొందరికే తగిన స్థలం ఉంది. నాలాంటి వాళ్లు మాత్రం ఇంట్లో పరిమిత స్పేస్‌‌తోనే అడ్జస్ట్‌‌ కావాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో  ఉంచుకొని మా ట్రైనర్లు  తగిన సూచనలు ఇస్తున్నారు. కోచ్‌‌ డబ్ల్యూవీ రామన్‌‌.. ట్రెయినింగ్‌‌ రెజిమే విషయంలో క్రియేటివ్‌‌గా ఆలోచిస్తున్నారు. అయితే, ఇండోర్స్‌‌లో ఎంత ట్రెయినింగ్‌‌ తీసుకున్నా కూడా ఈ పరిస్థితుల్లో  అది కష్టంగానే ఉంది. పూర్తి స్థాయిలో ప్రిపేర్‌‌ కావాలంటే  మేం గ్రౌండ్‌‌కు  వెళ్లాల్సిన అవసరం ఉంది’ అని ఈ హైదరాబాదీ చెప్పుకొచ్చింది.

Latest Updates