13 నెలల పాప మృతి: అనుమానాస్పదంగా అమ్మమ్మ మాటలు

13 నెలల పాప మృతి: అనుమానాస్పదంగా అమ్మమ్మ మాటలు

హైదరాబాద్‌లోని మియాపూర్‌‌లో అనుమానాస్పద స్థితి మృతి చెందిన 13 నెలల చిన్నారి కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మియాపూర్ సీఐ వెంకటేశ్ మీడియాకు వెల్లడించారు. మియాపూర్‌‌లోని ఓంకార్‌‌ నగర్‌‌లో 13 నెలల చిన్నారి సోనీ కనిపించడం లేదని నిన్న సాయంత్రమే తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారని చెప్పారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని నిన్న ఆ బస్తీ ఏరియాలన్నీ గాలించినా ఆచూకీ దొరకలేదన్నారు. దర్యాప్తు కొనసాగుతుండగా ఈ రోజు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో నోనీ అమ్మమ్మ ఎర్రమ్మకు పాప మృతదేహం కనిపించిందని తమకు సమాచారం అందిందని సీఐ వెంకటేశ్ తెలిపారు. పాప నీటిలో పడి చనిపోయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, శరీరంపై మాత్రం ఎలాంటి గాయాలు లేవని చెప్పారు. 

నెల రోజుల క్రితం పాప కంటికి గాయం కావడంతో ఆపరేషన్ చేశారని, అదే కంటికి గాయం కనిపిస్తోందని సీఐ చెప్పారు. నిన్న సాయంత్రం వరకు తమ బంధువుల మధ్య ఆడుకున్న చిన్నారి సోనీ కనిపించకుండా పోయిందన్నారు. అయితే ఈ ఘటనపై పాప అమ్మమ్మ చెబుతున్న విషయాలపై అనుమానంగా ఉందని సీఐ చెప్పారు. పాప మృతి ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరైనా కావాలని చేసిన పనా? అని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కుటుంబసభ్యుల మధ్య ఏమైనా వివాదాలు ఉన్నాయా అన్న కోణంలోనూ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించామని, రిపోర్ట్ రావాల్సి ఉందని సీఐ వెంకటేశ్ తెలిపారు.