మున్సిపల్ అధికారిని బ్యాట్ తో కొట్టిన ఎమ్మెల్యే

మధ్యప్రదేశ్ లో ఓ బీజేపీ ఎమ్మెల్యే .. ప్రభుత్వ అధికారిపట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న ఓ మున్సిపల్ అధికారిని .. క్రికెట్ బ్యాట్ తో కొట్టాడు. అతడి అనుచరులు కూడా ఇష్టమొచ్చినట్టుగా దాడిచేశారు. ఈ సంఘటన స్థానికంగా వివాదాస్పదమవుతోంది.

ఇండోర్ మున్సిపల్ అధికారులు.. అక్రమ కట్టడాలు, కబ్జాలపై డ్రైవ్ నిర్వహిస్తున్న టైమ్ లో ఈ సంఘటన జరిగింది. అక్కడకు అనుచరులతో వచ్చాడు బీజేపీ సీనియర్ నేత కైలాష్ విజయ్ వర్జియా కొడుకు, ఇండోర్ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గియా. వచ్చీ రావడంతో.. అక్కడ నిలబడి ఉన్న అధికారిని క్రికెట్ బ్యాట్ తో కొట్టాడు. పదే పదే కొట్టాడు. అంతే.. ఎమ్మెల్యే అనుచరులు.. ఆ అధికారిని ఉరికించారు. మున్సిపల్ ఆఫీసర్ ను ఎమ్మెల్యే అనుచరులు కూడా కాలర్ పట్టుకుని కొట్టారు. కొందరు ఆయన షర్ట్ విప్పేందుకు ప్రయత్నించారు.

ఈ సంఘటన వివాదాస్పదం కావడంతో.. ఎమ్మెల్యే మీడియాకు వివరణ ఇచ్చారు. అక్కడ కాంగ్రెస్ నాయకులు కట్టిన ఓ అక్రమ భవనం ఉందని… దానిని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించారని అన్నారు. ఈ విషయంలో తనను ముందుగా సంప్రదించాలని కోరినా వారు స్పందించలేదని అన్నారు. ఆ ఇంట్లో ఉంటున్నవాళ్లు, ఆడవాళ్లను కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చారని… అధికారులు అలా చేయడంతోనే తనకు కోపం వచ్చినట్టు చెప్పారు. కనీసం మహిళా పోలీసులను ఉపయోగించలేదని అన్నారు. తనకు ఓటేసి గెలిపించిన ఓటర్ల బాగోగులు తనకు ముఖ్యమనీ.. సదరు అధికారిపై తాను కేసు పెడతానని అన్నారు. “ముందు చెబుతాం.. తర్వాత విన్నవిస్తాం.. ఐనా వినకపోతే ధనాధన్ వాయిస్తాం.. అదే మా పద్ధతి” అని ఎమ్మెల్యే చెప్పారు.

ఈ సంఘటనపై ఇండోర్ అసిస్టిటెంట్ సూపరింటెండెంట్ ఆఫీసర్ అనిల్ పటిదార్ స్పందించారు. తప్పు ఎవరిదైనా కేసు పెట్టి శిక్ష వేస్తామని చెప్పారు.

Latest Updates