MLA కోనప్ప తమ్ముడు కృష్ణ అరెస్ట్.. పదవికి రాజీనామా

కొమురంభీం జిల్లా : కాగజ్ నగర్ మండలం సర్సాల గ్రామంలో ఈ ఉదయం 8.30 గంటలకు ఎఫ్.ఆర్.ఓ అనిత,అటవీ సిబ్బందిపై దాడి సంఘటనలో కేసులు నమోదు చేశారు జిల్లా పోలీసులు. అటవీ భూమిని అధికారులు దున్నుతుండగా రైతులు అడ్డుకున్నారని ఎస్పీ మల్లారెడ్డి చెప్పారు. ఇంతలోనే ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు జెడ్పీ వైస్ చైర్మన్, జెడ్పీటీసీ అయిన కోనేరు కృష్ణ, అతని అనుచరులు అక్కడికి వచ్చి… ట్రాక్టర్ పై ఉన్న FRO అనిత, సిబ్బందిపై కర్రలతో దాడిచేశారని చెప్పారు.

ఈ దాడి సంఘటనపై మొత్తం 16 మందిపై FDO రాజా రమణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాన నిందితుడు కోనేరు కృష్ణ, అతని అనుచరుడు పోచమల్లును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై IPC 353, 332, 307,147,148,427,507,149సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు. మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేస్తామన్నారు. ఫారెస్ట్ అధికారులకు రక్షణ కల్పిస్తామని ఎస్పీ మల్లారెడ్డి చెప్పారు.

జెడ్పీటీసీ పదవికి కోనేరు కృష్ణ రాజీనామా

కొమురంభీం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవికీ.. జెడ్పీటీసీ సభ్యత్వానికి కోనేరు కృష్ణ రాజీనామా చేశారు. రైతులపై అటవీశాఖ అధికారుల తీరుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేస్తున్నా అన్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీని కలిసి.. రాజీనామా లెటర్ సమర్పించారు కోనేరు కృష్ణ.

Latest Updates