డిసెంబర్​ దాక లాక్‌డౌన్​ పొడిగించాలి

  •   పండుగల పేరుతో ఇన్నాళ్ల కష్టం వేస్ట్‌ చేయొద్దు: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్రంలో లాక్​డౌన్‌ను ఇంకింతకాలం పొడిగించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. రంజాన్ తర్వాత మోహర్రం, బోనాలు, దసరా వస్తాయని.. అందుకే లాక్‌డౌన్‌ను ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగించాలని సోమవారం మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో చెప్పారు. లాక్ డౌన్ ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయని, పండుగల పేరుతో లాక్‌డౌన్ ఎత్తేస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు కష్టపడిందంతా వేస్ట్‌ అవుతుందన్నారు. సీఎం కేసీఆర్​ముందు జాగ్రత్తతో మే 7వ తేదీ దాక లాక్‌డౌన్​పెట్టారని… దీన్ని పొడిగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి లెటర్‌ రాస్తానన్నారు. ప్రాణాలకు తెగించి పని చేస్తున్న డాక్టర్లు, నర్సులకు… 24 గంటలు డ్యూటీలో ఉంటున్న పోలీసులకు సర్కారు అన్ని రకాల సౌలత్‌లు కల్పించాలన్నారు. ప్రభుత్వాలు ఎలా నిలదొక్కుకోవాలనే దానిపై ఆర్థికవేత్తలు సూచనలు చేస్తూ సహకరించాలని… సీఎం కేసీఆర్​ఆర్థికవేత్తలతో చర్చలు జరపాలన్నారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర సర్కారు తీసుకొనే నిర్ణయాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా సహకరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు బాగా చేస్తోందని… తన నియోజకవర్గ రైతులకు చెక్కులు కూడా అందించామని చెప్పారు. చెడగొట్టు వానలతో నష్టపోయిన మామిడి రైతులకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలని కోరారు.

Latest Updates