భూములు అప్పగించాలని ఎమ్మెల్యే కిష‌న్ రెడ్డి బెదిరిస్తున్నాడు

  • ప్రాణాలైనా వదులుకుంటం గానీ.. భూమిని మాత్రం వదులుకోం
  • విలేకరుల సమావేశంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ రైతులు

హైదరాబాద్: ‘ప్రాణాలైనా వదులుకుంటం గానీ.. భూమిని మాత్రం వదులుకోమని’ ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ రైతులు అన్నారు. హైదర్ గూడా ఎన్ఎస్ఎస్(న్యూస్ అండ్ స‌ర్వీస్ సిండికేట్‌) లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఫార్మాసిటీ పేరుతో తమ దగ్గర నుండి బలవంతంగా 40 వేల ఎకరాల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని నమ్ముకొని బతికే రైతు కుటుంబాలు వీధిన పడనున్నాయని అన్నారు.

మూడు సంవత్సరాల నుండి హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం భూసేకరణను వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించామని, హైకోర్టులో విషయాలు పెండింగ్‌లో ఉండగా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రైతులను తమ భూములను అప్పగించాలని బెదిరిస్తున్నారన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఎమ్మెల్యే మేడిపల్లి గ్రామంలో హెచ్‌పిసి కోసం భూమి పూజ చేయడానికి ప్రయత్నించినప్పుడు అడ్డుకున్న రైతులను విపరీతంగా కొట్టి గాయపరిచారని అన్నారు. ఎమ్మెల్యే కాన్వాయ్‌పై చెప్పులు విసిరారన్న కార‌ణంతో గురువారం రాత్రి ఒంటిగంటకు యాచారం మండలంలోని గ్రామాల చుట్టూ బెటాలియన్ తో పోలీసులు.. పదుల సంఖ్యలో రైతులను అరెస్టు చేసి తీసుకెళ్లారని ఆరోపించారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, ప్రాణాలైనా వదులుకుంటాము కానీ భూములను మాత్రం వదులుకోమని అన్నారు

Latest Updates