పార్టీకి వ్యతిరేకంగా నేనేం అన్లే : రాజయ్య

  • అనని మాటలు రాసిన్రు
  • కేసీఆర్‌‌, కేటీఆర్‌‌ల నాయకత్వాన్ని బలపరుస్తున్నా
  • కేబినెట్‌‌ ఏర్పాటులో సీఎంకు ఆబ్లిగేషన్స్‌‌ ఉంటయి
  • పదవి రాలేదని బాధ లేదన్న మాజీ డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌‌, వెలుగు: ‘మాదిగ బిడ్డగానే నన్ను గుర్తించి ఎన్నో అవకాశాలు ఇచ్చిన కేసీఆర్‌‌కు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. పార్టీలో ఎందరో సీనియర్లున్నా తొలి ఉప ముఖ్యమంత్రిగా పని చేసే చాన్స్‌‌ ఇచ్చారు. నాకు ఇష్టమైన వైద్య వృత్తి శాఖకు మంత్రిని చేశారు. తెలంగాణ రాజన్నగా తీర్చిదిద్దారు. అసెంబ్లీ లాబీల్లో నేను అనని మాటలు అన్నట్టు రావడం చూసి బాధేసింది. కేసీఆర్‌‌, కేటీఆర్‌‌ల నాయకత్వాన్ని వంద శాతం బలపరుస్తున్నా’ అని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌ ఎమ్మెల్యే టి. రాజయ్య అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేను కేసీఆర్‌‌కు, పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నేను మాట్లాడినట్టు ఎక్కడా ఆడియో, వీడియోలు లేవు’ అన్నారు. కేబినెట్‌‌ ఏర్పాటులో సీఎంకు ఆబ్లిగేషన్స్‌‌ ఉంటాయని, అయినా పదవి రాలేదని తనకు బాధ లేదని చెప్పారు. అందరికీ ఒకేసారి అవకాశాలు రావని, ‘ఓర్సుకున్నోనికి వరంగల్‌‌ పట్నమంత’ సామెత ప్రకారం ఓర్పు కొనసాగిస్తే మంచిది అనుకుంటున్నానని అన్నారు.

కేటీఆర్‌‌ మద్దతుతోనే గెలిచా

డిప్యూటీ సీఎం పదవి పోయినా ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా పనిచేసే అవకాశం తనకు కల్పించారని రాజయ్య చెప్పారు. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారని, 7 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌‌ టికెట్లు ఇచ్చుకునే అవకాశం కల్పించారని అన్నారు. 2018 ఎన్నికల్లో కేటీఆర్‌‌ మద్దతుతోనే భారీ మెజార్టీతో గెలిచానన్నారు. వరంగల్‌‌కు హెల్త్‌‌ యూనివర్సిటీ ఇవ్వడం కేసీఆర్‌‌ తనకిచ్చిన వరమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మాదిగ బిడ్డలు ఎన్నో త్యాగాలు చేశారని కేసీఆర్‌‌ తనకు చెప్పారని, రాష్ట్రంలో మాదిగలకు త్వరలోనే మరిన్ని పదవులు వస్తాయని ఆశిస్తున్నానన్నారు. కేసీఆర్‌‌ అందరికీ న్యాయం చేస్తారని, ఆ నమ్మకం తనకు ఉందన్నారు. తన స్థాయికి తగిన పదవి ఇస్తానని కేసీఆర్‌‌, కేటీఆర్‌‌ హామీ ఇచ్చారని చెప్పారు.

MLA Rajaiah comments on his cabinet post at Telangana Bhavan

Latest Updates