కేసీఆర్‌ రాష్ట్రానికి సీఎం.. గజ్వేల్ కే కాదు

ఈ విషయాన్ని కేసీఆర్​ గుర్తుంచుకోవాలి
ఏ స్కీంకు కేంద్రం ఎంతిస్తుందో చెప్పాలి: రాజాసింగ్​

కేసీఆర్​ సీఎంగా ఉంది గజ్వేల్​కు మాత్రమే కాదని, తెలంగాణ రాష్ట్రానికి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​ సూచించారు. రూ. 30 వేల కోట్ల లోటును ఎట్ల పూడ్చుకుంటారని, రాష్ట్రం చేస్తున్న అప్పులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్​ చేశారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్​పై చర్చలో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం ఉందని, ప్రతిసారి కేంద్రాన్ని విమర్శించడం కరెక్ట్ కాదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్​ఎస్ హామీ ఇచ్చిన ‘కేజీ టు పీజీ విద్య’ ఎక్కడ వరకు వచ్చిందని రాజాసింగ్​ ప్రశ్నించారు. తన నియోజకవర్గం గోషామహల్​ అభివృద్ధి కోసం ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా చెత్తబుట్టలో వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్, నేషనల్​ హైవేస్​, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, హౌసింగ్​, 11 ఇరిగేషన్​ ప్రాజెక్టులు.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, మహిళా, రైతు, ఉద్యోగుల వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు విడుదల చేసిందో చెప్పాలని ప్రశ్నించారు.

డబుల్​ బెడ్రూం ఇండ్లెన్ని కట్టారు?

రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారు? ఎన్ని కట్టారు? వాటి లెక్క చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజాసింగ్​ డిమాండ్ చేశారు. ఎంఎంటీఎస్​ ఫేజ్​ –2కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడానికి కారణాలేమిటో చెప్పాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ మంచి స్కీమ్​లని, ఈ స్కీమ్​ల​లో కేంద్రం నిధులు ఉన్నాయో లేదో చెప్పాలన్నారు. పెళ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే బాగుంటుందని సూచించారు. కేసీఆర్​ కిట్​లో కేంద్రం ఇస్తున్న డబ్బులు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ప్రధానమంత్రి మాతృవందన స్కీమ్​ కింద తెలంగాణకు వచ్చిన రూ. 75.81 కోట్లను ఎలా వినియోగించారో చెప్పాలని ప్రశ్నించారు.  ప్రధానమంత్రి సమ్మాన్​ నిధి అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుల డేటాను పూర్తి స్థాయిలో ఇవ్వలేదని ఆరోపించారు.

అట్లయితే చలో ఢిల్లీ నిర్వహిద్దాం

తెలంగాణ వాసిగా రాష్ట్రాభివృద్ధిని తాను కోరుకుంటున్నానని రాజాసింగ్‌‌‌‌ చెప్పారు. కేంద్రం నిజంగా రాష్ట్రానికి సాయం చేయకపోతే అన్ని పార్టీలతో కలిసి చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిద్దామని, తాను కలిసి వస్తానని రాజాసింగ్​ స్పష్టం చేశారు.

స్టూడెంట్లపై లాఠీచార్జ్​ చేస్తరా?

విద్యారంగానికి బడ్జెట్‌‌‌‌‌‌‌‌ కేటాయింపులు పెంచాలని కోరుతూ స్టూడెంట్లు చలో అసెంబ్లీ చేపడితే వారిపై లాఠీచార్జ్​ చేస్తారా? అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం జీరో అవర్‌‌‌‌‌‌‌‌లో ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్​ను ఆయన ప్రస్తావించారు. ఏ స్టూడెంట్ల వల్ల తెలంగాణ వచ్చిందో వారినే కొడుతారా? అని నిలదీశారు. స్టూడెంట్లను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్లలో బంధించారని, దీనిపై స్పందించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.

Latest Updates