ఫండ్స్​ లేక.. పబ్లిక్‌లోకి పోలేక.. ఎమ్మెల్యేల పరేషాన్​

  • సీడీపీ నిధుల కొరత
  • గత బడ్జెట్​లో ఊసేలేదు.. ఈ బడ్జెట్​లోనైనా కేటాయించేనా?

ఏ ఊళ్లెకు పోయినా ఎవలు ఉర్కొచ్చి నిలదీత్తరోనని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు బుగులు పట్టుకుంది. జనం ఏమడుగుతరోనని, ఏ పన్జేయమంటరోనని పరేషాన్​ అయితున్రు. పేరుకే ఎమ్మెల్యేలమని, సీడీపీ ఫండ్స్​ రాక ఊర్లల్ల మొఖం చెల్తలేదని రంధి పడ్తున్రు. తమకాడ పైసల్లేకపోయెసరికి ఆఖరికి గల్లీ లీడర్లు కూడా మాట వింటలేరని ఎమ్మెల్యేలు నారాజ్​ అయితున్రు.

హైదరాబాద్, వెలుగు: ఏటా ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి పథకం(సీడీపీ) కింద ఇచ్చే నిధులను గత బడ్జెట్​లో రాష్ట్ర సర్కారు కేటాయించలేదు. రేపోమాపో అసెంబ్లీలో ప్రవేశపెట్టే 2020‌‌–21 బడ్జెట్​లో కూడా అదే రిపీట్​ అయితే  పరిస్థితి ఏందని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యేలు ఊళ్లలో పర్యటించినప్పుడు అక్కడి సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించేందుకు సీడీపీ నిధులు ఉపయోగపడుతుంటాయి. టీఆర్​ఎస్​ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫండ్స్​ ఊసే లేదు. ఊళ్లలో చాలా సమస్యలు పెండింగ్​లో ఉన్నాయి. వాటిని పరిష్కరించాలంటూ జనం  నిలదీస్తున్నారు. సీడీపీ ఫండ్స్​ ఉంటే కొన్ని సమస్యలనైనా పరిష్కరించేవాళ్లమని,  ఫండ్స్​ లేకపోవడంతో 14 నెలల నుంచి ఊళ్లలో సరిగ్గా తిరగలేకపోతున్నామని ఎమ్మెల్యేలు అంటున్నారు. ఈసారి బడ్జెట్​లోనైనా నిధులు కేటాయించాలని సందర్భం దొరికిన ప్రతిసారీ సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి చేస్తున్నారు. మంత్రి కేటీఆర్  దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తున్నారు. తమ తొలి ప్రభుత్వంలో చేసిన పనులకు కూడా బిల్లులు రావడం లేదని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారు.

14 నెలల్లో పైసా పని జేయలే!

రెండోసారి టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయింది. ఈ కాలంలో ఊళ్లలో తాము పైసా పనిచేయలేకపోయామని ఎమ్మెల్యేలు అంటున్నారు. అసెంబ్లీ రద్దుకు ముందు చేసిన పనులు తప్ప కొత్తగా ఏ పనికి శ్రీకారం చుట్టలేదని చెబుతున్నారు.

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ముందు చాలా పనులకు శంకుస్థాపనలు చేశామని, అవన్నీ కూడా టీఆర్​ఎస్​ తొలి ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన పనులకు తిరిగి కొబ్బరి కాయలు కొట్టడం లాంటివని ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ సారి బడ్జెట్ లో సీడీపీ కింద నిధులు కేటాయించకపోతే జనంలో ముఖ్యంగా పార్టీ లోకల్​ క్యాడర్​లో ఎమ్మెల్యేలు చులకనవుతారని ఆయన అన్నారు. సీడీపీ నిధులుంటే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అక్కడి సమస్యల పరిష్కారానికి వెంటనే  నిధులను సాంక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ పనుల్లో కొన్నయినా నామినేషన్ పద్ధతిన తమ అనుచరులకు, క్యాడర్​కు కేటాయించి వారిని సంతృప్తి పరిచే అవకాశం కూడా ఎమ్మెల్యేలకు ఉంటుంది.

మర్యాద ఇస్తలేరు

సీడీపీ నిధులు లేకపోవడంతో ఎమ్మెల్యేలకు కార్యకర్తలు, లోకల్ లీడర్లు మర్యాద ఇవ్వడం  లేదని టీఆర్​ఎస్​ వర్గాల్లో టాక్​ నడుస్తోంది. ఎమ్మెల్యే పర్యటన ఉందంటేనే లోకల్​ లీడర్లు తప్పించుకుని తిరిగే పరిస్థితి ఉందని ఓ సీనియర్​ ఎమ్మెల్యే అన్నారు. ‘‘ఎమ్మెల్యేల దగ్గర పైసల్లేవు. ఆయన ప్రోగ్రాంలకు పోవుడ దండుగ. మాకు చిన్న పని కూడా ఇవ్వడు. ఎందుకు పోవుడు’’ అనే అభిప్రాయం గ్రౌండ్​ లెవల్​లో ఉందని ఆయన పేర్కొన్నారు. మంత్రుల పరిస్థితి కూడా అలాగే ఉంది. కార్యకర్తలు చిన్న చిన్న పనులు అడిగితే నిధులు లేవని చెప్పాలంటే నామోషీ అవుతోందని  ఉత్తర తెలంగాణకు  చెందిన ఓ మంత్రి అన్నారు.

నాడు రూ. 3 కోట్లు జేసి.. మరి ఇప్పుడు ?

ఉమ్మడి రాష్ట్రంలో సీడీపీ కింద ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి రూ. కోటి నిధులు ఇచ్చేవారు. అయితే  2015లో సీఎం కేసీఆర్  దాన్ని రూ. కోటిన్నరకు చేర్చారు. 2016–-17లో ఏకంగా రూ. 3 కోట్లు చేశారు. అయితే.. మళ్లీ అధికారంలోకి రాగానే మరిన్ని నిధులు ఇస్తారని ఎమ్మెల్యేలు ఆశపడ్డారు. తీరా ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవని 2019–20  బడ్జెట్ లో పైసా కూడా కేటాయించలేదు.

పాత బిల్లులు ఇంకా ఇవ్వలే

2018 సెప్టెంబర్​ 6న అసెంబ్లీ రద్దుకు ముందు ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున పనులను మంజూరు చేశారు. సీఎం పరిధిలోని స్పెషల్ డెవలప్​మెంట్ ఫండ్ తోపాటు సీడీపీ కింద చాలా పనులు చేపట్టారు. ఆ పనులన్నీ పూర్తయి ఏడాదిన్నర అవుతోంది. నిధులు మాత్రం ఇంకా ఇవ్వడం లేదని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే  అన్నారు. ‘నాకు తెల్సిన కాంట్రాక్టర్ కు రూ. 80 లక్షల రోడ్డు పని వచ్చింది. పని పూర్తయి ఏడాదిన్నర అయినా బిల్లు రాలేదు. బయటికి చెప్పితే ఇజ్జత్​ పోతది’ అని తెలిపారు.

Latest Updates