పంట దిగుబ‌డి త‌గ్గ‌డానికి వ్యవసాయశాఖ నిర్లక్ష్యమే కారణం

చీడపీడలతో రైతులు ఇప్పటికే పంట దిగబడి తగ్గి నష్టపోయారని ఇప్పుడు మళ్లీ కొనుగోలు కేంద్రాల్లో కోతలు విధిస్తుండటంతో మరింత నష్టపోతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శుక్ర‌వారం కరీంనగర్ జిల్లాలోని ఇళ్లందకుంటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి . ఈ సందర్భంగా జీవ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. చీడ పీడలతో రైతుకు ఎకరాకు 5 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి తగ్గిందని, అందుకు వ్యవసాయశాఖ నిర్లక్ష్యమే కారణమ‌న్నారు. రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో ధాన్యం పండిందనుకుంటే ఎకరాకు పది వేల రూపాయ చొప్పున మొత్తం 4 వేల కోట్ల రూపాయలు రైతులు నష్ట పోయారన్నారు.

ధాన్యం సేకరణ కేంద్రం నుంచి మిల్లుకు తరలించినప్పుడు ధర్మకాంట రసీదు ఇవ్వడం లేద‌ని, ధర్మకాంట దగ్గర నమోదైన ధాన్యం తూకం రసీదును మిల్లర్లు ఎందుకు దాచిపెడుతున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. భారత ఆహార సంస్థ సూచనలకు అనుగుణంగా ధాన్యంలో లోపాలున్నా 16 శాతం మినహాయింపు ఇవ్వాలని చెప్పారు. కానీ అధికార పార్టీ నేతలే రెండు కిలోల కోత పెడితే ఏం పోతుందని చెబుతున్నారని జీవ‌న్ రెడ్డి విమ‌ర్శించారు.  ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇప్పటికైనా సర్కారు వారిని ఆదుకోవాలని ఆయ‌న అన్నారు.

mlc jeevan reddy comments in ellanthakunta karimnagar district

Latest Updates