
హైదరాబాద్, వెలుగు: ఏపీలో సచివాలయ కార్యదర్శుల ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు అవకాశం ఇప్పించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ, ఏపీ సీఎస్‌లకు గురువారం లేఖ రాశారు. రూల్స్ ప్రకారం ఇతర రాష్ట్రాల వారికి 20 శాతం అన్‌రిజర్వుడ్ కోటాలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.. కానీ, ఏపీ సచివాలయ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీలో ఆ రూల్స్‌ను పాటించడం లేదన్నారు. సచివాలయ కార్యదర్శుల ఉద్యోగాలకు అర్హత సాధించినప్పటికీ తెలంగాణకు చెందిన వారనే కారణంగానే కొందరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ సబ్సిడీలు పొంది ఏర్పాటు చేసిన పరిశ్రమలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, మెట్రో రైలు ప్రాజెక్టుల్లోనూ రాష్ట్ర యువతకు ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదన్నారు. సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించిన తెలంగాణ యువతకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందించే విధంగా ఏపీ సీఎం జగన్‌తో చర్చించి న్యాయం చేయాలని సీఎం కేసీఆర్‌ను ఆయన కోరారు.