వ్యవసాయంలో ప్రభుత్వం సరైన విధానాన్ని పాటించడం లేదు

వ్యవసాయ విధానాల్లో ప్రభుత్వం లోపభూయిష్టంగా వ్య‌వ‌‌హ‌రిస్తోంద‌న్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి. ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయంలో స‌రైన విధానాన్ని పాటించ‌డం లేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయ‌న‌ బహిరంగ లేఖ రా‌శారు. రాష్ట్రంలో రుణ‌మాఫీ ఇంకా అమలు కాలేదని లేఖ‌లో పేర్కొంటూ..ఇంకా లక్షలాది మంది రైతులకు పాసు పుస్తకాలు అందలేదన్నారు. గతంలో రైతు బంధు ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేస్తాం అన్నారని, ఇప్పుడు 5 ఎకరాల భూమి ఉన్నవారికి ఇస్తున్నారన్నారు. బిందు సేద్యానికి కేంద్రం ఇచ్చే సబ్సిడీ కూడా రాష్ట్రంలోని రైతులు‌ వాడుకునే పరిస్థితి లేదన్నారు.

మంగ‌ళ‌వారం గాంధీభ‌వ‌న్ లో జ‌రిగిన ప్రెస్ మీట్ లో జీవ‌న్ రెడ్డి మాట్లాడుతూ …ధాన్యం సేకరణలో రైతులు 5 నుంచి 10 కిలోల కోతతో నష్టపోయారన్నారు జీవ‌న్ రెడ్డి. పంటసాగు పైన దేశంలో ఎక్కడా ఆంక్షలు లేవని, రాష్ట్రంలో మాత్రం నియంతృత్వ వ్యవసాయం సాగుతుంద‌న్నారు. ఇది కేవలం రైస్ మిల్లర్ల కోసం రైతాంగాన్ని తాకట్టు పెట్టడమేన‌న్నారు. సన్నబియ్యం పంటలతో రైతులకు దిగుబడి తగ్గి, పంటకాలం పెరిగి రైతులకు నష్టం వస్తుంది అందువల్ల సన్న రకాలకు క్విటాలకు 2500 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పండ్లతోటలను ఒక కుట్ర పూరితంగా నష్టం చేస్తున్నారని, వ్యవసాయంతో పాటు పండ్ల తోటల పెంపకాలను ప్రోత్సహించాలన్నారు. పండ్ల తోటలకు ప్రోత్సాహకాలు అందించి ఆదుకోవాల‌ని జీవ‌న్ రెడ్డి సూచించారు.

Latest Updates