‘మీ సమీక్షలు, సమావేశాలు మాకు అక్కర్లేదు.. మా నీళ్లు మాకు ఇస్తే చాలు’

జగిత్యాల జిల్లా: కేవలం సమీక్ష సమావేశాలకు, ప్రకటనలకు మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం పరిమితమైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమ‌వారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘మీ సమీక్షలు, సమావేశాలు మాకు అక్కర్లేదు.. రూ.8 కోట్లు విడుదల చేసి మాకు నీళ్లు ఇస్తే చాలు’ అని టీఆర్ఎస్ నేత‌ల‌నుద్దేశించి అన్నారు.

కొండ పోచమ్మ ప్రాజెక్టుకు నిధులు ఉంటాయి కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాజెక్టులకు నిధులు ఎందుకు ఉండవని ప్ర‌శ్నించారు. స్వయంగా ముఖ్యమంత్రే నిర్వహిస్తోన్న‌ నీటి పారుదల శాఖకు నిధుల కొరతా? అని అడిగారు. మా నీళ్లు మాకు ఇవ్వకుండా ఎక్కడికో పట్టుకోపోవడం సరి కాదు అని ఆయ‌న అన్నారు. మేడిపల్లి, కథలాపూర్, కోరుట్ల మండలాల్లోని 44వేల ఎకరాలకు సాగునీరందించే సూరన్న చెరువుకు రూ.200 కోట్ల పనులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేసినా పనులు పూర్తి కాలేదని.. ఛలో సూరమ్మ చెరువుకు కాంగ్రెస్ పార్టీ పిలుపుతో టీఆర్ఎస్ నాయ‌కుల్లో కదలిక వచ్చిందన్నారు

కరీంనగర్ ఎల్.ఎం.డికి ఈ నెల 15 న నీళ్లు విడుదల చేస్తామని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పార‌ని, మరి జగిత్యాల పరిస్థితి ఏంట‌ని జీవ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు.రోహిణి లోపు చెరువులు, కుంటలు నింపుతామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారని.. ఆయ‌న క్యాలెండర్ లో రోహిణీ ఇంకా రాలేదా ? అని అడిగారు. జగిత్యాల జిల్లాలో ఒక పంట సాగుకు కేవలం 25 టీం ఎంసీ లు సరిపోతుందని అన్నారు. ఖరీఫ్ సాగు కోసం 15 జులై లోపు ఎస్సారెస్పీ ద్వారా నీళ్లు అందించాలని జీవ‌న్ రెడ్డి అన్నారు.

Latest Updates