మొబైల్ ఇడ్లీ క్రేజీ అంతా ఇంతా కాదండోయ్

ఉదయం వంట చేసే ఓపిక లేకపోతే.. సిటీల్లో ఉండేవాళ్లైతే ఫుడ్‌‌‌‌ డెలివరీ యాప్ప్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ చేస్తారు. కాస్త ఓపిక ఉంటే దగ్గరలోని హోటల్‌‌‌‌కు వెళ్లి తింటారు. మరి పల్లెల్లో ఉండేవాళ్ల పరిస్థితి? హోటళ్లు అరకొరగా ఉంటాయి. ఫుడ్‌‌‌‌ డోర్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌ అసలే ఉండదు. అయితే.. అలాంటి వాళ్ల కోసమే దిలీప్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ ‘ఇడ్లీ’ సర్వీస్​ చేస్తున్నాడు. అది కూడా ముప్పై ఏళ్ల నుంచి. ఇది చూసి మీరు తెప్పించుకుందాం అనుకుంటున్నారేమో.. అస్సలు కుదరదు. ఆ అవకాశం నాగర్​ కర్నూల్​ జిల్లా బల్మూర్​ మండలంలోని కొండనాగుల చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు మాత్రమే..

అచ్చంపేట, వెలుగు

నాలుగు గంటలకే..

దిలీప్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ ఇంటర్మీడియెట్‌‌‌‌ పూర్తయ్యాక చాలా ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. కానీ.. ఎక్కడా జాబ్‌‌‌‌ దొరకలేదు. పైగా అతనికి ఊరు వదిలివెళ్లడం ఇష్టంలేదు. అందుకే ఇంటి దగ్గరే ఉండి ఏదైనా పని చేసుకోవాలనుకున్నాడు. ఏదైనా బిజినెస్‌‌‌‌ చేద్దామంటే.. పెద్దగా ఆస్తులు లేవు. పని చిన్నదైనా, పెద్దదైనా గౌరవంగా బతికితే చాలు అనుకున్నాడు. అప్పుడే వచ్చింది ఈ ఇడ్లీ ఐడియా.
ఇంట్లో  ఇడ్లీలు చేసుకుని, చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లి కాలినడకన తిరుగుతూ అమ్మడం మొదలుపెట్టాడు. ముప్ఫై ఏళ్లుగా అదే పని చేస్తున్నాడు. వచ్చిన డబ్బుతో ఆనందంగా బతుకుతున్నాడు.

ప్రతి రోజు ఉదయం నాలుగు గంటలకే దిలీప్‌‌‌‌కుమార్​ దినచర్య మొదలవుతుంది. ఆయనతోపాటే భార్య, పిల్లలు కూడా నిద్రలేచి పని చేస్తారు. అందరూ కలిసి ఇడ్లీలు, చట్నీ చేస్తారు. తర్వాత దిలీప్‌‌‌‌ వాటిని తీసుకుని చుట్టు పక్కల పల్లెలకు బస్సుల్లో వెళ్తాడు. వీధుల్లో తిరుగుతూ వాటిని అమ్ముతాడు. ప్రస్తుతం రోజుకు 300 నుంచి 400 రూపాయల వరకు సంపాదిస్తున్నాడు.
అంతకన్నా ఎక్కువ డబ్బు సంపాదించే పనులు ఎన్నో ఉన్నా .. ‘ఇంకొకరి దగ్గర పని చేయడం ఇష్టం లేక ఈ పనే చేస్తున్నా. తక్కువ డబ్బులు వచ్చినా.. ఈ పని నాకు చాలా సంతోషాన్నిస్తుంది’ అంటున్నాడు దిలీప్‌‌‌‌.

క్రేజ్‌‌‌‌ ఎక్కువే

దిలీప్‌‌‌‌కుమార్​ చేసే ఇడ్లీలను అందరూ బాగా ఇష్టపడతారు. పిల్లలయితే మరీ ఎక్కువ. దిలీప్‌‌‌‌కుమార్​ మాట వినపడితే చాలు.. పిల్లలు ఇడ్లీలు కొనమని మారాం చేస్తారు. తల్లిదండ్రులు ఇడ్లీలు కొనిచ్చే వరకు ఊరుకోరు. పొద్దున్నే నిద్ర లేచి పొలం పనుల్లో నిమగ్నమయ్యే పల్లె ప్రజలకు టిఫిన్​ చేసుకునే టైమే ఉండదు. అలాంటి వాళ్లకు ఎప్పుడైనా టిఫిన్‌‌‌‌ చేయాలనిపిస్తే ఊళ్లో హోటల్‌‌‌‌ కూడా ఉండదు. అందుకే అంతా దిలీప్​ కుమార్​ ఇడ్లీల కోసం ఎదురు చూస్తారు.

Latest Updates