రాజస్థాన్‌లో రేపు ఉదయం 10 వరకు ఇంటర్నెట్ బంద్

రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాద కేసులో సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. సంవత్సరాలుగా గొడవల్లో ఉన్న వివాదాస్పద భూమిని హిందువులకు కేటాయిస్తూ తీర్పు చెప్పింది. అందువల్ల రాష్ట్రంలో ఎటువంటి గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో జైపూర్ డివిజనల్ కమిషనర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

రాజస్థాన్ లోని జైపూర్, అల్వార్, సికార్లలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు జైపూర్ డివిజనల్ కమిషనర్ కేసీ. వర్మ తెలిపారు. ఈ నిలిపివేత రేపు అనగా నవంబర్ 10 ఆదివారం ఉదయం 10 గంటల వరకు అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. అజ్మీర్‌లో కూడా రేపు ఉదయం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.  అంతేకాకుండా అజ్మీర్‌లో 144 సెక్షన్ అమలు పెట్టారు. దాంతో స్కూళ్లు, కాలేజీలకు ఈ రోజు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదనీ.. అయినప్పటికీ శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Latest Updates