లాక్​డౌన్​లో కట్ చేసిన జీతాలియ్యరా?

  • మోడల్ స్కూల్ టీచర్లకు అందని సగం శాలరీ
  • అమలు కానీ సర్కారు జీవో 
  • ఆందోళనలో మోడల్ స్కూల్ టీచర్లు, సిబ్బంది

హైదరాబాద్, వెలుగు: కరోనా లాక్ డౌన్ కాలంలో మూడు నెలల పాటు ఉద్యోగుల వేతనాల్లో సర్కారు కోత పెట్టింది.  లాక్​డౌన్​ సడలింపులు జరిగాక, కట్ చేసిన మొత్తాన్ని నాలుగు దఫాలుగా చెల్లిస్తామని జీవోలు జారీ చేసింది. అయితే అన్ని శాఖల్లో బకాయిలు ఇచ్చినా, మోడల్ స్కూల్​ టీచర్లకు మాత్రం బకాయిలు ఇంకా అందలేదు. రాష్ట్రంలో మొత్తం 194 మోడల్ స్కూళ్లుండగా, వీటిలో 3 వేలమంది రెగ్యులర్ టీచర్లు, రెండువేల మంది కాంట్రాక్టు, ఔట్​ సోర్సింగ్ టీచర్లు, హాస్టల్ సిబ్బంది పనిచేస్తున్నారు. లాక్​డౌన్ ​నేపథ్యంలో రెగ్యులర్ ఎంప్లాయీస్ జీతాల్లో 50 శాతం, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పదిశాతం వేతనం కట్ చేశారు.  సుమారు ఐదు వేలమంది జీతాల్లో కోతపెట్టారు. లాక్ డౌన్​ను సడలించాక, కట్ చేసిన మూడు నెలల జీతాన్ని అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు నాలుగు విడతల్లో ఇవ్వాలని గత సెప్టెంబరులో జీవో నెంబర్ 61 రిలీజ్ చేశారు. ఈ జీవోను అన్నీ శాఖల్లో అమలు చేసినా, మోడల్ స్కూళ్లలో మాత్రం అమలు చేయడం లేదు. కోత పెట్టిన దాంట్లో ఇప్పటికీ ఒకవంతు కూడా అందలేదు. దీంతో టీచర్లు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బడ్జెట్ శాంక్షన్ చేసినా…

మోడల్ స్కూల్ టీచర్ల లాక్​డౌన్​ వేతనాలతో పాటు 2018 నుంచి రావాల్సిన మూడు డీఏ బకాయిలు కూడా పెండింగ్​లో ఉన్నాయి. వీటన్నింటికీ రూ.82.24కోట్లు ఇస్తున్నట్టు గత నెల18న జీవో ఇచ్చారు. వీటిని విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు ఫైనాన్స్ డిపార్ట్​మెంట్​ను కోరగా, ఇంతమొత్తం ఒకేసారి ఇవ్వడం కుదరని చెప్పినట్టు తెలిసింది. తొలివిడతగా రూ.35 కోట్లు కేటాయిస్తూ చెక్​ ఇచ్చినా, అది రిజెక్ట్ అయినట్టు తెలిసింది. రూ.35 కోట్లను కూడా మూడు భాగాలుగా విభజించి పంపించాలని నోటిమాటగా చెప్పినట్టు తెలిసింది.  అయితే బడ్జెట్ శాంక్షన్ అయిందనీ, త్వరలోనే  బకాయిలు ఇస్తామని విద్యాశాఖ చెబుతోంది.

మోడల్ స్కూళ్లపై వివక్ష ఎందుకు

మా జీతం మాకు ఇవ్వడానికి సర్కారుకు ఇంకా ఎన్ని రోజుల టైమ్ కావాలి. లాక్​డౌన్​లో కోత పెట్టిన జీతాలు అందరికీ ఇచ్చి, మాకు మాత్రమే ఇవ్వకపోవడానికి వచ్చిన సమస్య ఏంటో చెప్పాలె. మోడల్ స్కూల్ టీచర్లు, సిబ్బందిపై వివక్ష సరికాదు. లాక్​డౌన్​ కాలంలోని అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, వెంటనే కోత పెట్టిన జీతంతో పాటు డీఏ బకాయిలు ఒకేసారి చెల్లించాలి. – భూతం యాకమల్లు, టీఎంఎస్టీఏ స్టేట్ ప్రెసిడెంట్

Latest Updates